భారత దేశ తొలి హాలీవుడ్ నటుడు బయపిక్!
ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే...ఆయనే సాబు దస్తగిరి. 1937 లో `ఎలిఫెంటా బోయ్` చిత్రంతో సినీ రంగంలోకి సాబు దస్తగిరి అడుగు పెట్టారు.;
హాలీవుడ్ లో కూడా ఇప్పుడు భారతీయ నటులు భాగమవుతోన్న సంగతి తెలిసిందే. ఏదో సినిమాలో చిన్నా చితకా పాత్రల్లో ఇంగ్లీష్ సినిమాల్లో కనిపిస్తున్నారు. మేల్...ఫీమేల్ నటులు హాలీవుడ్ లో అరుదుగా వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కువగా ఈ రేసులో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన వారే కనిపిస్తుంటారు. అందులోనూ ఈ మధ్య కాలంలో స్టార్ బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్ లో నటించడం అన్నది పరిపాటిగా మారింది.
మరి ఇంతకీ భారత్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన తొలి నటుడు ఎవరు? అంటే మాత్రం చాలా మందికి తెలియదు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే...ఆయనే సాబు దస్తగిరి. 1937 లో `ఎలిఫెంటా బోయ్` చిత్రంతో సినీ రంగంలోకి సాబు దస్తగిరి అడుగు పెట్టారు. `ది థీప్ ఆఫ్ బాగ్దాద్`, `జంగిల్ బుక్`, `అరేబియన్ నైట్స్` లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. తాజాగా ఇప్పుడీయన జీవితాన్ని వెండి తెరకెక్కిస్తున్నారు. ఆల్మైటీ మోషన్ పిక్చర్స్ సాబు దస్తగిరి కథను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
దెబ్లీనా ముజుందార్ రాసిన సాబు `ది రిమార్క్ బుల్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ యాక్టర్ ఇన్ హాలీవుడ్` అనే పుస్తకం ఆధారంగా తీర్చి దిద్దుతున్నారు. సాబు కథను నిజాయితీగా చెప్పాల్సిన అవసరం అంతే ఉంది. ఆయన భారతదేశపు మొట్ట మొదటి హాలీవుడ్ నటుడు మాత్రమే కాదు. సంస్కృతులు-యాగాల మధ్య వారధి. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం ఓపెద్ద బాధ్యతగా నిర్మాణ వర్గాలు పేర్కొన్నాయి.
మైసూర్ నుంచి హాలీవుడ్ కి ఎదిగిన సాబూ జీవితమే ఈ సినిమా. చిన్న వయసులో సాబు దస్తగిరి మైసూరు సంస్థానంలో ఏనుగుల సంరక్షకుడిగా ఉండేవారు. తండ్రి నేర్పించిన విద్యతో ఏనుగులను మచ్చిక చేసుకున్నాడు ఆ వయసులోనే. అడవి జంతువుల మధ్య జీవించడం తప్ప మరో జీవనం తెలియదు. కనీసం సినిమా అంటే ఏంటో కూడా తెలియదు. కట్ చేస్తే 13 ఏళ్లకే బాల నటుడిగా నీరాజనాలు అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి లెజెండరీగా ఎదిగారు.