నాని 'ప్యారడైజ్' దారి ఎటో వెళ్తుంది..!
'ది ప్యారడైజ్' సినిమాలో మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ రాఘవ్ జుయల్ నటిస్తున్న విషయం తెల్సిందే.;
నేచురల్ స్టార్ నాని హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. గత ఏడాది సరిపోదా శనివారం, ఈ ఏడాది హిట్ 3 సినిమాలతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని అంతకు ముందు దసరా, హాయ్ నాన్న సినిమాలతోనూ మెప్పించింది. వరుస సక్సెస్‌లతో జోష్ మీదున్న నాని తదుపరి సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న ది పారడైజ్ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్యారడైజ్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచుతూ వస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు లుక్‌ను రివీల్ చేయడంతో సినిమాను వార్తల్లో ఉంచిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ తో చర్చలు జరపడం ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు.
నాని హీరోగా ది ప్యారడైజ్ మూవీ...
'ది ప్యారడైజ్' సినిమాలో మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ రాఘవ్ జుయల్ నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరు మాత్రమే కాకుండా హాలీవుడ్ స్టార్ కాస్ట్‌ను సైతం ఈ సినిమాల ఇన్వాల్వ్ చేయడం ద్వారా సినిమా స్థాయిని పెంచాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ తో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఆయన ఈ సినిమా కోసం దాదాపుగా 20 నుంచి 30 రోజుల కాల్షీట్స్ ఇస్తానని ఒప్పుకున్నాడట. భారీ పారితోషికంతో పాటు, ఇతర అలవెన్స్‌లు ఆయనకు ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. అతి త్వరలోనే ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్ నటించడం ద్వారా ఇంగ్లీష్ ప్రేక్షకులు సైతం ది ప్యారడైజ్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో
నాని సినిమాలను ఆ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కొన్ని సినిమాలను హిందీ, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల చేయడం జరిగింది. కానీ తెలుగులో తప్ప మరే భాషలోనూ నాని సినిమాలు మినిమం వసూళ్లు నమోదు చేయలేక పోయాయి. దాంతో నాని పాన్ ఇండియా ఆశలు వదులుకున్నాడు. నాని హీరోగా చేస్తున్న సినిమాలు తెలుగు వరకే విడుదల అవుతున్నాయి. మళ్లీ ఇప్పుడు నాని పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. హాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో నటించడం ద్వారా ఇండియన్ భాషల్లోనే కాకుండా అంతకు మించి అన్నట్లుగా ఈ సినిమా విడుదలైన ఆశ్చర్యం లేదు. అందుకే ర్యాన్ రేనాల్డ్స్ ఈ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో నాని ప్యారడైజ్ దారి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో అనే చర్చ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల మూవీ
దసరా తర్వాత వెంటనే పలు సినిమాలకు ఆఫర్లు వచ్చినా, పలువురు హీరోలు టచ్‌లోకి వచ్చినా శ్రీకాంత్ ఓదెల మాత్రం తదుపరి సినిమాను సైతం నానితోనే చేయాలనే పట్టుదలతో మూడు ఏళ్లు వెయిట్ చేసి ఈ సినిమాను మొదలు పెట్టాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది ప్యారడైజ్ సినిమా ఫలితంను బట్టి ఆయన తదుపరి సినిమాలు ఉండే అవకాశం ఉంది. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి నాని సినిమాలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. నాని సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తన తదుపరి సినిమాను చిరంజీవితో చేస్తాడని అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ ఈ మధ్య ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ప్యారడైజ్ సినిమా తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదల సినిమా ఉందా లేదా అనేది వచ్చే ఏడాదిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.