రుక్మిణి వసంత్ స్ఫూర్తిదాయక ప్రయాణం!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి భారతీయ సినీ వేదికపై అత్యంత వేగంగా దూసుకుపోతున్న యువ నటీమణుల్లో రుక్మిణి వసంత్ ఒకరు.

Update: 2026-05-23 22:30 GMT

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి భారతీయ సినీ వేదికపై అత్యంత వేగంగా దూసుకుపోతున్న యువ నటీమణుల్లో రుక్మిణి వసంత్ ఒకరు. `కాంతార: చాప్టర్ 1` చిత్రంలో అమ్మ‌డు పోషించిన కనకవతి పాత్ర దేశవ్యాప్తంగా సినీ ప్రియుల మనసులను గెలుచుకుంది. ఈ భారీ సక్సెస్ సొగ‌స‌రిని ప్యాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టడమే కాదు. పరిశ్రమలో రుక్మిణి అపారమైన ప్రతిభను పరిచయం చేసింది. అయితే అమ్మ‌డు కేవలం వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ స్ఫూర్తిదాయకమైన నేపథ్యాన్ని కలిగి ఉంద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

రుక్మిణి వసంత్ భారత సైన్యంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కుమార్తె. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. 2007లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునే క్రమంలో వీరమరణం పొందారు. దేశ రక్షణ కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగానికి గాను భారత ప్రభుత్వం ఆయనకు మరణానం తరం అత్యున్నత సైనిక పురస్కారమైన అశోక చక్రతో సత్కరించింది. కర్ణాటక రాష్ట్రం నుండి గౌరవాన్ని అందు కున్న మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన రుక్మిణి ఆర్మీ వాతావరణంలో క్రమశిక్షణతో పెరిగింది.

తండ్రి మరణం తర్వాత రుక్మిణి జీవితాన్ని ఆమె ఆలోచనా విధానాన్ని ఆమె తల్లి సుభాషిణి వసంత్ ఎంతగానో ప్రభావితం చేశారు. భర్తను కోల్పోయిన తీవ్ర దుఃఖాన్ని భరిస్తూనే ఆ తల్లి వీర రత్న అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అమరవీరుల కుటుంబాలకు, వారి పిల్లల చదువుల కోసం ఎంతో కృషి చేశారు. బాధను ఎదుర్కొని సమాజానికి తిరిగి సేవ చేయడం ఎలాగో తన తల్లిని చూసే నేర్చుకున్నానని రుక్మిణి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఆర్మీ నేపథ్యం ఆమెలో ఓ దృఢమైన వ్యక్తిత్వాన్ని, సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొం దించింది.

కళల పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న రుక్మిణి లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో నటనలో శిక్షణ పొందింది. అటుపై 2019లో కన్నడ చిత్రం `బీర్బల్ ట్రైలజీ` తో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అనంతరం `సప్త సాగరదాచే ఎల్లో` వంటి భావోద్వేగభరితమైన చిత్రాల ద్వారా నటిగా తనదైన ముద్ర వేసింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. `కాంతార: చాప్టర్ 1` చిత్రం రుక్మిణి కెరీర్‌ను మలుపు తిప్పింది.

నాలుగో శతాబ్దపు యోధ యువరాణి `కనకవతి` పాత్ర కోసం ఆమె పడిన కష్టం సామాన్యమైనది కాదు. ఈ పాత్ర హావభావాలను, రాజసం ఉట్టిపడే నడకను ఒంట బట్టించుకోవడానికి షూటింగ్‌కు ముందే ప్రత్యేక వర్క్‌షాప్‌లలో పాల్గొంది. అంతేకాదు కత్తిసాము , గుర్రపు స్వారీ వంటి కఠినమైన విద్యలలో శిక్షణ పొందింది. తెరపై అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను పండించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రుక్మిణి వసంత్ భారీ పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `డ్రాగ‌న్` లో ఈ బ్యూటీనే హీరోయిన్. అలాగే క‌న్న‌డ‌లో య‌శ్ న‌టిస్తోన్న మ‌రో పాన్ ఇండియా చిత్రం `టాక్సిక్` లోనూ న‌టిస్తోంది. ఇలా ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్ ల్లో న‌టించ‌డంతో క్రేజ్ పీక్స్ లో ఉంది.

Tags:    

Similar News