ఎంటర్టైనింగ్ పురుషః.. ఈసారి బెస్ట్ ఆప్షన్ ఏమో..

మూవీలో ప్రధానంగా కనిపించే అంశం.. భార్యాభర్తల బంధాన్ని ఒకే యాంగిల్ లో కాకుండా, సరదా పద్ధతిలో చూపించడమే.

Update: 2026-07-24 18:33 GMT

టాలీవుడ్‌ లో ప్రతి వారం కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం పెద్దగా హడావుడి లేకుండానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు చేరిన సినిమా పురుషః. థియేటర్లలో ఆకట్టుకున్న ఆ కామెడీ డ్రామా.. ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో అందుబాటులోకి రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కుటుంబ కథలు, కామెడీ, చిన్న మెసేజ్ తో కూడిన చిత్రాలను ఇష్టపడేవారికి ఈ వీకెండ్‌ లో ఇది బెస్ట్ ఆప్షన్‌ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పురుషః సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలు, పెళ్లి తర్వాత భర్తలు ఎదుర్కొనే పరిస్థితులను ఎంటర్టైనింగ్ గా చూపించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. "ప్రతి ఇంట్లో జరిగే కథ" అనే ట్యాగ్‌ లైన్‌ తో వచ్చిన ఆ చిత్రం.. సాధారణ కుటుంబాలకు దగ్గరగా ఉండే అంశాలను ఎంచుకోవడం విశేషం. సినిమా కథ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది.

పెళ్లి తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులు, భార్యలతో వచ్చే అభిప్రాయ భేదాలు, వాటి కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను దర్శకుడు ఎంటర్టైనింగ్ గా చూపించారు. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడంతో.. చివరకు వారు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. అక్కడ జడ్జి వారి కథలు వినడం ద్వారా సినిమా ఫ్లాష్‌ బ్యాక్‌ లోకి వెళ్లే విధంగా కథనాన్ని నడిపించారు.

మూవీలో ప్రధానంగా కనిపించే అంశం.. భార్యాభర్తల బంధాన్ని ఒకే యాంగిల్ లో కాకుండా, సరదా పద్ధతిలో చూపించడమే. భర్తల యాంగిల్ ను హైలైట్ చేసినప్పటికీ.. చివరికి సమస్యలకు పరిష్కారం ప్రేమ, పరస్పర అవగాహనలోనే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే సినిమా కూడా ఒక చిన్న సందేశంతో ముగుస్తుంది. కొత్త హీరో పవన్ కళ్యాణ్ బత్తుల ఆ చిత్రంతో తెరంగేట్రం చేయగా.. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌ కుమార్, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్ వంటి నటులు తమ కామెడీ టైమింగ్‌ తో సినిమాకు ప్లస్ అయ్యారు.

ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కన్వర్జేషన్లు, ఇంట్లో జరిగే సంఘటనలను గుర్తు చేసేలా ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంగా చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా సింపుల్ ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటున్నారు. భారీ యాక్షన్, థ్రిల్లర్‌ లతో పాటు కుటుంబం అంతా కలిసి చూడగలిగే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే పురుషఃకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కొత్త ప్రేక్షకులు దొరికే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

ముఖ్యంగా వీకెండ్ లో ఎక్కువ ఆలోచించకుండా, నవ్వుకుంటూ సమయం గడపాలనుకునే వారికి ఆ సినిమా సరైన సెలెక్షన్ గా నిలవొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశం వచ్చింది. అందుకే పురుషః.. ఈసారి బెస్ట్ ఆప్షన్ ఏమో అనే చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కుటుంబ బంధాలు, సరదా సంఘటనలు, చిన్న సందేశం.. ఆ మూడు అంశాలు కలిసిన మూవీ ఓటీటీలో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News