హిట్ మ్యాన్ మనసులో సూపర్ స్టార్లు వీళ్లే!
| తన హోస్టింగ్ షోలో రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కూడా సౌత్ ఇండియన్‌నేనని, తన మాతృభాష తెలుగు అని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపారు. ప్రస్తుత దక్షిణాది హీరోల నటనను కూడా ప్రశంసించారు.
మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపించే టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మైదానం బయట సరదా మాటలతో అభిమానులను ఆకట్టుకోవడంలోనూ స్పెషలిస్టే. ప్రస్తుతం హోస్ట్‌గా `ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ` అనే గేమింగ్ రియాలిటీ షోను నడిపిస్తున్న హిట్ మ్యాన్ తాజా ఎపిసోడ్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షోలో పాల్గొన్న అర్జున్ అనే కంటెస్టెంట్ మీకు ఇష్టమైన సౌత్ ఇండియన్ హీరో ఎవరని అడగడంతో రోహిత్ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.
ఒక్కరి పేరు చెప్పడం కష్టమని నవ్వుతూ సమాధానమిచ్చిన రోహిత్ తాను చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన మూలాల గురించి ప్రస్తావించారు.`బహుశా మీకు తెలియ దనుకుంటా? నేను కూడా సౌత్ ఇండియన్‌నే.. నా మాతృభాష తెలుగు` అని రోహిత్ గుర్తుచేశారు. ముంబైలో పెరిగినా? ఇంట్లో దక్షిణాది సంస్కృతి.. భాషా ప్రభావం ఎక్కువగా ఉంటున్నారు. చిన్నతనంలో ఇంట్లో టీవీ లో కుటుంబమంతా కలిసి సినిమాలు చూసేవాళ్లమని రోహిత్ తెలిపారు.
ముఖ్యంగా తమిళ.. తెలుగు చిత్రాలను ఎంతో ఇష్టంగా చూసేవాళ్లమన్నారు. ఆ రోజుల్లో రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్ సినిమాలంటే ఎంతో ఇష్టమని.. వాళ్ల చిత్రాలను చూస్తూనే పెరిగానని హిట్ మ్యాన్ మనసులోని మాట బయట పెట్టారు. ఇప్పటి తరం నటుల ప్రతిభను కూడా రోహిత్ ప్రత్యేకంగా అభినందించారు. సౌత్ ఇండస్ట్రీలోకి ఇప్పుడు చాలా మంది కొత్త హీరోలు వచ్చారని.. వారందరూ అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే పంకజ్ త్రిపాఠి నటించిన `పారివారిక్ మనోరంజన్` సినిమా కూడా బాగా నచ్చిందని రోహిత్ పేర్కొన్నారు.
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ - సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న షోలో రోహిత్ శర్మ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. క్రికెట్ ఒత్తిడికి దూరంగా కంటెస్టెంట్లతో కలిసి ఆటపాటలతో సందడి చేస్తూనే కుటుంబ నేపథ్యం.. సినిమాలపై ఉన్న ఇష్టాన్ని ఓపెన్ గా పంచుకోవడం అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి హోస్ట్ గా మారిన రోహిత్ భవిష్యత్ లో క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వెండి తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చినా? ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.