క్రికెట్ టీమ్ కొనేసిన చాహల్ గాళ్ ఫ్రెండ్
నిన్న మొన్నటి వరకూ ఒక సాధారణ రేడియో జాకీ (ఆర్జే).. కంటెంట్ క్రియేటర్.. కానీ ఇప్పుడు బిజినెస్ ఉమెన్.;
నిన్న మొన్నటి వరకూ ఒక సాధారణ రేడియో జాకీ (ఆర్జే).. కంటెంట్ క్రియేటర్.. కానీ ఇప్పుడు బిజినెస్ ఉమెన్. ఎంటర్ ప్రెన్యూర్ గా తొలి అడుగులు వేయడమే గాక అంచెలంచెలుగా ఎదిగేందుకు బలమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఆర్జే మహ్వాష్. అంతేకాదు.. ఇప్పుడు ఏకంగా షాన్ మార్ష్ కెప్టెన్‌గా కొనసాగే ఒక క్రికెట్ టీమ్‌నే కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది.
మహ్వాష్ క్రికెట్ వ్యాపారంలోకి ప్రవేశించారని తెలియగానే సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్, నెటిజనులు షాక్ కి గురయ్యారు. నిన్న మొన్నటివరకూ క్రికెటర్ చాహల్ తో లవ్- డేటింగ్ అంటూ పుకార్లు పుట్టుకు రాగా, నిజంగా మహ్వాష్ కి అంత సీన్ ఉందా? అనుకున్నారు. ఏదో స్టేడియంలో తనదైన గ్లామ్ షోతో యువతరాన్ని ఆకర్షిస్తోందని అనుకున్నారు కానీ, ఉన్నట్టుండి ఇలా క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేసి ఎంటర్ ప్రెన్యూర్ రేంజుకు ఎదిగేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఊహకు అతీతంగా దూసుకెళ్లే సత్తా తనకు ఉందని నిరూపించారు ఆర్జే మహ్వాష్.
అతడితో సాన్నిహిత్యంతోనే క్రేజ్:
క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తో ఎఫైర్ వార్తల కారణంగా మహ్వాష్ పేరు నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. చాహల్ తన భార్య ధనశ్రీకి విడాకులిచ్చి మహ్వాష్‌తో అత్యంత సన్నిహితంగా మెలగడంతో ఆమె క్రేజ్ కూడా పీక్స్ కి చేరుకుంది. భార్య నుంచి విడాకులు తీసుకున్న క్రికెటర్‌తో షికార్లు మహ్వాష్ క్రేజ్ ని పెంచాయే కానీ తగ్గించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలు, డిజిటల్ మాధ్యమాల్లో మహ్వాష్ అసాధారణ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ క్రేజీగా దూసుకెళుతోంది.
20-20 ని మించిన టోర్నీకి ప్లాన్:
ఇలాంటి సమయంలో మహ్వాష్ నుంచి అంతకుమించి అనిపించేలా పెద్ద శుభవార్త అందింది. పరిమిత ఓవర్ల (10 ఓవర్లు) టోర్నీలో పోటీపడే ఒక క్రికెట్ టీమ్ ని మహ్వాష్ వేలంలో కొనుగోలు చేసింది. ఆగస్టు 22-24 తేదీలలో నోయిడాలో మూడు రోజుల టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సిఎల్‌టి10 (క్రికెట్ లీగ్ T10) జరగనుండగా, ఇందులో పాల్గొనే `సుప్రీం స్ట్రైకర్స్` టీమ్ ని తన సొంతం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన వేలంలో మహ్వాష్ క్రేజీ ఆటగాళ్లున్న టీమ్ ని ఛేజిక్కించుకుని యజమానిగా మారింది. పైగా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ స్టార్ షాన్ మార్ష్ ను టీమ్ కెప్టెన్ గా ప్రకటించింది మహ్వాష్. పాపులర్ క్రీడా ప్రెజెంటర్ చారు శర్మ నిర్వహించిన CLT10 వేలంలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా పాల్గొన్నారు. శృంగార నటి సన్నీ లియోన్ , ప్రిన్స్ నరులా వంటి ప్రముఖులు ఈ క్రీడా వేలంలో పాల్గొన్నారని సమాచారం. ఆ ఇద్దరూ కూడా కొన్ని టీమ్‌లలో తెలివిగా పెట్టుబడులు పెట్టారని తెలిసింది.
ఎంత పోటీ ఉన్నా నిరాశచెందక మహ్వాష్ బిడ్డింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రతిభావంతులు ఉన్న టీమ్‌ని కొనుగోలు చేయడంలో చాకచక్యం చూపించారు. ఇకపై కెప్టెన్ షాన్ మార్ష్ తో ముడిపడి ఉన్నామని మహ్వాష్ టీమ్ ని కొనుగోలు చేసిన సందర్భంగా ఆనందంగా ప్రకటించారు. టీ- 20 కెప్టెన్సీలో విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్న మార్ష్ తన టీమ్ కి కెప్టెన్ కావడంతో ఆర్జే మహ్వాష్ ఆనందంలో మునిగి తేల్తున్నారు. పది ఓవర్ల ఫార్మాట్ లో సాగే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 20-20తో పోలిస్తే, ఇది (10-10 ఓవర్లు) రెట్టింపు వేగం, ఉత్సుకతను కలిగించే టోర్నీ అని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రీతి జింతా, కావ్యా మారన్ తరహాలోనే ఇప్పుడు ఆర్జే మహ్వాష్ క్రీడా రంగ వ్యాపారంలో రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఈ ఆట లక్ష్యం:
సాధారణంగా ఫోర్ కట్స్ బాల్ తో క్రికెట్ ఆడుతున్నారు. ఈ తరహా ఆటకు భిన్నంగా సాంప్రదాయ టెన్నిస్ బాల్ క్రికెట్‌ను భారీ పెట్టుబడులు వెదజల్లి ప్రొఫెషనల్ క్రీడగా మార్చడం ఈ లీగ్ లక్ష్యం. వేలంలో ఆటగాళ్ల కోసం భారీ మొత్తాలను యజమానులు పెట్టుబడులుగా పెడుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. సన్నీలియోన్, ప్రిన్స్ నరులా కూడా కాస్త పెద్ద మొత్తాలనే పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిసింది. ఆర్జే నుంచి క్రీడా వ్యాపారిగా మారిన మహ్వాష్ ఇప్పటికే నటనా రంగంలోను ప్రవేశించింది. కొన్ని సినిమాలకు సంతకాలు చేసి నటిగా బిజీ అయిపోతోంది.