విజయ్ సినిమాను వ‌దులుకున్న డైరెక్ట‌ర్.. ఎందుకంటే?

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ కొన్ని ప్రాజెక్టులు మాత్రం పరిస్థితుల వల్ల మిస్ అవుతాయి.;

Update: 2026-03-23 05:51 GMT

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ కొన్ని ప్రాజెక్టులు మాత్రం పరిస్థితుల వల్ల మిస్ అవుతాయి. తర్వాత అవే స‌ద‌రు హీరో మిస్సైన బ్లాక్‌బస్టర్స్ గా చర్చకు వస్తాయి. తాజాగా అలాంటి ఆసక్తికరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేయాల్సిన ఒక సినిమా చివరికి మరో హీరో వద్దకు వెళ్లడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మూకుతి అమ్మ‌న్ తో డైరెక్ట‌ర్ గా మారిన ఆర్జే బాలాజీ

రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్జే బాలాజీ మూకుత్తి అమ్మన్ అనే సినిమాతో డైరెక్ట‌ర్ గా కూడా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన విజయ్ కోసం ప్రత్యేకంగా ఒక కథను సిద్ధం చేశారు. 2023లో విజయ్‌ను కలిసి ఈ కథను నేరేట్ చేయగా, ఆ కథ ఆయనకు నచ్చినట్టు సమాచారం. అయితే విజయ్ కొన్ని కీలక మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కథలో మరింత వినోదం పెంచాలని, అలాగే సినిమా పనులను చాలా వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరినట్టు బాలాజీ వెల్లడించారు.

త‌క్కువ టైమ్ లో పూర్తి చేయాల‌ని సూచ‌న‌

ఇక్కడే ఈ ప్రాజెక్ట్‌కు అసలు ట్విస్ట్ వచ్చింది. అప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్న విజయ్, తనకు ఉన్న పరిమిత సమయం కారణంగా ఫాస్ట్ ట్రాక్‌లో సినిమాలు పూర్తి చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో తాను సూచించిన టైంలైన్‌లో సినిమా పూర్తవ్వాలని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. కానీ డైరెక్ట‌ర్ గా కథను తనకు నచ్చిన విధంగా మలచుకోవడానికి, ప్రొడక్షన్‌ను క్వాలిటీతో పూర్తి చేయడానికి సమయం అవసరమని భావించిన బాలాజీ, ఆ వేగానికి సరిపోలలేకపోయారు.

కాంప్ర‌మైజ్ అవ్వ‌ని బాలాజీ

దీంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినా, తన పని విధానాన్ని కాంప్రమైజ్ చేయకుండా వెనక్కి తగ్గిన బాలాజీ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. స్టార్ డిమాండ్స్, డైరెక్ట‌ర్ విజన్ మధ్య జరిగే ఈ తరహా టైంలైన్ క్లాష్ లు సాధారణమే అయినా, ఇలాంటి సందర్భాల్లో ప్రాజెక్టులు పూర్తిగా మారిపోవడం అరుదుగా జరుగుతుంది. అయితే ఈ కథ ఇక్కడితో ఆగలేదు. విజయ్ కోసం రెడీ చేసుకున్న అదే కథను బాలాజీ తరువాత మరో స్టార్ హీరో అయిన సూర్య‌కు వినిపించగా, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు చెప్పారు. కరుప్పు టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్ర‌స్తుతం రిలీజ్ కు ముస్తాబవుతోంది. దీంతో ఇదే కథ విజయ్‌తో తెరకెక్కి ఉంటే ఎలా ఉండేదీ? అది నిజంగా బ్లాక్‌బస్టర్ అయ్యేదా? లేక ఇప్పుడు రూపుదిద్దుకున్న వెర్షన్‌నే ఆడియన్స్ ఎక్కువగా అంగీకరిస్తారా? అనే దానిపైనే అంద‌రి దృష్టి ఉంది. సినీ ఇండస్ట్రీలో కథలకంటే టైమింగ్ ముఖ్యమైపోయే సందర్భాలు కూడా ఉంటాయ‌నే విష‌యాన్ని ఈ సంఘ‌ట‌న మ‌రోసారి గుర్తు చేస్తోంది.

Tags:    

Similar News