బజ్ లేకుండా బాక్సాఫీస్ టెస్ట్?
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కరుప్పు సినిమా చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కరుప్పు సినిమా చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. స్టార్ హీరో సూర్య, సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించిన ఆ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలకు సిద్ధమవుతున్న ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, రివ్యూలపై ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఆర్జే బాలాజీ.. "నేను సోషల్ మీడియా కోసం సినిమా తీయలేదు. రివ్యూలతో సినిమాలను పోస్ట్‌మార్టం చేసే వాళ్లను పట్టించుకోను" అంటూ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ తోనే వివాదం మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం సినిమా విజయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందనే అభిప్రాయం గట్టిగా ఉంది. ఒకప్పుడు సినిమా గురించి తెలుసుకోవాలంటే టీవీ ప్రమోషన్స్, పోస్టర్లు, న్యూస్ పేపర్ల రివ్యూలే మెయిన్ సోర్సెస్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లలో సినిమా టాక్ వైరల్ అవుతోంది.
ప్రేక్షకుల అభిప్రాయాలు, ఫ్యాన్ రివ్యూలు, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ లు ఇప్పుడు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఒక మంచి సీన్, ఎమోషనల్ డైలాగ్ లేదా మాస్ ఎలివేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయితే.. సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అదే సమయంలో కంటెంట్ వీక్ గా ఉంటే నెగిటివ్ ట్రోల్స్ కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతాయి. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాను పూర్తిగా పక్కన పెట్టి సినిమా విజయాన్ని ఊహించడం కష్టమేనని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఇక బాలాజీ కామెంట్లపై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దర్శకుడిగా తన కాన్ఫిడెన్స్ ను మాత్రమే ఆయన బయటపెట్టారని అంటుంటే.. మరికొందరు మాత్రం సోషల్ మీడియా ఎఫెక్ట్ ను తక్కువగా అంచనా వేయడం సరైన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇటీవల అనేక సినిమాలు సోషల్ మీడియా మౌత్ టాక్ వల్లే పెద్ద విజయాలు సాధించాయి. చిన్న సినిమాలు కూడా పాజిటివ్ బజ్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఉదాహరణలు ఉన్నాయి.
అలాగే నెగిటివ్ రివ్యూల గురించి మాట్లాడే ముందు.. సోషల్ మీడియా సినిమాలకు ఎంత పెద్ద ప్రమోషన్ ప్లాట్ ఫామ్ గా మారిందో గుర్తించాల్సిన అవసరం ఉందని సినీ అభిమానులు చెబుతున్నారు. ట్రైలర్ విడుదల నుంచి పాటల ప్రమోషన్స్ వరకు అన్నీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లపైనే ఆధారపడి ఉన్నాయి. హీరోల ఫ్యాన్స్ కూడా సినిమాను ట్రెండ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే చివరికి ప్రేక్షకులు చూసేది కంటెంట్ మాత్రమే అన్నది మరో వాదన. సినిమా బాగుంటే సోషల్ మీడియా ప్రశంసిస్తుంది.. లేదంటే విమర్శిస్తుంది. అది నేచురల్ ప్రాసెస్ గానే చూడాలనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు కరుప్పు విషయంలో కూడా అదే ఆసక్తి నెలకొంది. బాలాజీ కామెంట్స్ ఎంత వైరల్ అయినా.. చివరకు సినిమా ఎలా ఉందన్నదే అసలు రిజల్ట్ ను డిసైడ్ చేయనుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటే ప్రశంసలు వస్తాయి.. లేదంటే ట్రోల్స్ తప్పవు. కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ ను పూర్తిగా తగ్గించి చూడలేమన్న విషయం మాత్రం మరోసారి స్పష్టమైందని చెప్పాలి.