తానొకటి తలచిన.. అన్‌లక్కీ తెలుగమ్మాయ్ తెర‌వెన‌క క‌థ‌!

అయితే గ్లామ‌ర్ పరిశ్రమలో ప్రతిభ ఎంత‌ ఉన్నా.. అదృష్టం కూడా కలిసిరావాలనే దానికి రీతూ వర్మ కెరీర్ ఒక ఉదాహరణ.

Update: 2026-06-21 23:30 GMT

`పెళ్లి చూపులు` లాంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తో సోలో హీరోయిన్‌గా కెరీర్‌ను టేకాఫ్ చేసుకుంది తెలుగమ్మాయి రీతూ వర్మ. అంత‌కుముందు కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా `పెళ్లి చూపులు` తెచ్చిన గుర్తింపే వేరు! ఓవ‌ర్ నైట్ స్టార్ డ‌మ్ పెంచిన చిత్ర‌మిది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్, చియాన్ విక్రమ్, గోపీచంద్ లాంటి క్రేజీ ..అగ్ర హీరోల సరసన వరుసగా అవకాశాలను అందుకుంది. అయితే గ్లామ‌ర్ పరిశ్రమలో ప్రతిభ ఎంత‌ ఉన్నా.. అదృష్టం కూడా కలిసిరావాలనే దానికి రీతూ వర్మ కెరీర్ ఒక ఉదాహరణ. న‌టిగా ఎదిగే క్ర‌మంలో.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో స‌త్తా చాటుతూ దూసుకెళ్లాల్సిన స‌మ‌యంలో తన కెరీర్ గురించి ఎంత పెద్దగా ఊహించుకుందో.. అందుకు అతీతంగా దురదృష్టవశాత్తూ కొన్ని దెబ్బలు పడ్డాయి.

ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ - స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన `ధృవనక్షత్రం` త‌న కెరీర్ గేమ్ ఛేంజ్ చేస్తుంద‌ని ఆశించింది. కానీ అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కినా అది క‌లిసి రాలేదు. తన కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి రీడిఫైన్ చేసేంత గొప్ప ప్రతిభావంతులతో పనిచేసే ఛాన్స్ వ‌చ్చినా దురదృష్టవశాత్తూ ఆ సినిమా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, రిలీజ్ ఏళ్ల తరబడి ఆలస్యం అవ్వడం ఈ తెలుగ‌మ్మాయిని వేధించింది. ఇంతటి క్రేజీ సినిమాలో భాగమయ్యాక కూడా అది ప్రేక్షకులకు దూరం అవ్వడాన్ని రీతూ జీర్ణించుకోలేని దుస్థితి ఏర్పడింది.

అయినా.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రీతూ వర్మ మొక్కవోని దీక్షతో తన పంథాలో ముందుకు సాగుతోంది. న‌టిగా కెరీర్ ప‌రంగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సరసన భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న `భరతవర్ష- సాగా ఆఫ్ షులా` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాపై రీతూ వర్మ చాలా హోప్స్ పెట్టుకుంది. కెరీర్‌లో తప్పనిసరిగా ఒక భారీ హిట్ పడాల్సిన అత్యంత కీలకమైన సమయంలో ఈ హిస్టారిక‌ల్ డ్రామాలో భాగం కావడం విశేషం.

జాతీయ అవార్డు గ్రహీత, వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న `భరతవర్ష- సాగా ఆఫ్ షులా` సినిమా కథాంశం భారతదేశ ప్రాచీన కాలం, చారిత్రక యుద్ధాల నేపథ్యంతో ముడిపడిన‌ది. కమర్షియల్ హంగులతో పాటు అద్భుతమైన విజువల్స్, అప్పటి సంస్కృతీ సంప్రదాయాల నేపథ్యంలో ఒక యోధుడి కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌కు పూర్తి వైవిధ్యమైనది.. ఎందుకంటే అత‌డు తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌ను పక్కనబెట్టి రాజుల కాలం నాటి ఒక సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. అటు సంకల్ప్ మార్క్ మేకింగ్, ఇటు గోపీచంద్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాను ఇద్దరి కెరీర్‌కు ఎంతో ప్రత్యేకంగా మార్చబోతున్నాయి.

ఈ చారిత్రక కథాంశంలో నటిగా తనను తాను నిరూపించుకోవడానికి రీతూ వర్మకు చాలా ఎక్కువ‌ స్కోప్ ఉంది. కేవలం ఒక సాదాసీదా హీరోయిన్ పాత్రలా కాకుండా... కథను మలుపు తిప్పే బలమైన, రాచరికపు లేదా చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాత్రలో త‌ను కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సంకల్ప్ రెడ్డి సినిమాల్లో మహిళా పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి... రీతూ వర్మ తన నటనతో మరోసారి మెప్పించే వీలుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే అన్‌లక్కీ హీరోయిన్ అనే ముద్రను చెరిపేసి రీతూ వర్మ ద‌క్షిణాదిన‌ మళ్లీ ఒక రేంజ్‌లో బిజీ అవ్వడం ఖాయం.

Tags:    

Similar News