పరభాషా నటులకు టాలీవుడ్ లో ఎందుకంత ప్రాధాన్యత?
టాలీవుడ్ లో అగ్రశ్రేణి దర్శకులు కీలక పాత్రల కోసం పరభాషా నటుల వైపు మొగ్గు చూపడం సర్వ సాధారణమైంది.
టాలీవుడ్ లో అగ్రశ్రేణి దర్శకులు కీలక పాత్రల కోసం పరభాషా నటుల వైపు మొగ్గు చూపడం సర్వ సాధారణమైంది. ఒకప్పుడు తెలుగు నటులకే పరిమితమైన సినిమాలు ఇప్పుడు పాన్-ఇండియా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కథాంశానికి అనుగుణంగా వైవిధ్యం కోసం, ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడం కోసం ఇతర పరిశ్రమల నుంచి నటులను ఎంపిక చేసుకోవడం వ్యూహాత్మక నిర్ణయంగా మారింది. ప్రధానంగా నటనలోని గాఢత ..పాత్రకు అవసరమైన గంభీరత కోసం దర్శకులు పరభాషా నటులను ఆశ్రయి స్తున్నారు.
మలయాళం, తమిళం, కన్నడ , హిందీ పరిశ్రమల నుంచి వచ్చే నటుల్లో ప్రత్యేకమైన నటన శైలి కనిపిస్తుంది. వారు పోషించే పాత్రలు తెరపై ఓ కొత్త అనుభూతిని ఇస్తాయని దర్శకులు భావిస్తారు. ముఖ్యంగా నెగటివ్ రోల్స్ ..ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కోసం తెలుగు నటుల కంటే వారిని ఎంచుకోవడం ద్వారా పాత్రకు మరింత బలం చేకూరుతోందని దర్శకుల బలమైన నమ్మకంగా కనిపిస్తుంది. అలాగే మార్కెట్ విస్తరణ .. వాణిజ్య పరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇతర భాషల నుంచి పేరున్న నటులను తీసుకోవడం తో ఆయా భాషల్లో సినిమాకు మార్కెట్ పెరుగుతుంది.
ఇది కేవలం ఒక భాషా సినిమాగా కాకుండా మల్టీ-లింగ్వల్ ప్రాజెక్ట్‌గా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది. డబ్బింగ్ సినిమాల కన్నా? స్థానిక భాషా నటులున్నప్పుడు ఆయా రాష్ట్రాల ప్రేక్షకులు చిత్రాన్ని తమదిగా భావించి ఆదరించే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది నిర్మాతల బలమైన నమ్మకం. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు, ఆయా నటుల రూపం లేదా బాడీ లాంగ్వేజ్ కచ్చితంగా సరిపోవాలని దర్శకులు కోరుకుంటారు. టాలీవుడ్‌లో ఎప్పుడూ కనిపించే ముఖాల కంటే కొత్త ముఖాలను చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.
కొత్త నటుల ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఓ విధమైన ఉత్కంఠ కనిపిస్తుంది. అది సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే ఈ ధోరణి వల్ల తెలుగు నటులకు అవకాశాలు తగ్గుతున్నాయనే వాదన కూడా బలంగా ఉంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో ప్రతిభావంతులైన తెలుగు నటులకు తగిన గుర్తింపు లభించడం లేదన్నది అంతే వాస్తవం. అయినప్పటికీ దర్శక నిర్మాతలు కమర్షియల్ సక్సెస్ .. క్రియేటివ్ వైవిధ్యం కోసం పరభాషా నటులనే నమ్ముతున్నారు. వీరి ఎంపిక వెనుక ఉన్న వ్యాపార వ్యూహం ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని విధంగా కనిపిస్తోంది.
చివరగా సినిమా అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్. పాత్రకు ఎవరు సరైనవారో వారే ఎంపిక కావాలి. అది తెలుగు నటుడా? పరభాషా నటుడా? అన్నది ముఖ్యం కాదు. కానీ టాలీవుడ్ దర్శకులు ఇలా పరభాషా నటులపై ఆధారపడటం వల్ల పరిశ్రమలో కూడా ఇతర భాషల ప్రభావం పెరుగుతోంది. ఏది ఏమైనా? ఇలాంటి ప్రయోగాల వల్ల తెలుగు సినిమా పరిధి పెరుగుతోందన్నది వాస్తవం. నటుల ఎంపిక విషయంలో ఈ కొత్త ఒరవడి టాలీవుడ్‌ను మరింత ఉన్నత స్థానంలో నిలబెడుతుందని చెప్పొచ్చు.