'కాంతార' హీరో ఈ అన్ ఫాలో గోలేంటీ?
చిన్న చిన్న సినిమాలు, క్యారెక్టర్లతో కన్నడ నాట ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రిషబ్ శెట్టి.;
చిన్న చిన్న సినిమాలు, క్యారెక్టర్లతో కన్నడ నాట ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రిషబ్ శెట్టి. ఆ తరువాత శెట్టి ద్వయం రక్షిత్ శెట్టి, రాజ్ బి. శెట్టిలతో కలిసి సినిమాలు చేస్తూ నటుడిగా, హీరోగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. రాజ్ బి. శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన `గరుడగమన వృషభ వాహన`లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించి రిషబ్ శెట్టి మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. రక్షిత్‌శెట్టి, రాజ్ బి. శెట్టి లేకుండా రిషబ్ శెట్టి కెరీర్ లేదు అనేంతగా వీరిద్దరు రిషబ్ కోసం పని చేశారు.
కాంతార క్లైమాక్స్ ఫైట్‌ని రాజ్ బి శెట్టి డిజైన్ చేయడం, అది సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అయి రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేర్చింది. ఆ తరువాత వచ్చిన `కాంతార 2` కూడా రికార్డు స్థాయి విజయాన్ని సాధించి రిషబ్ శెట్టికి దేశ వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపుని అందించడంతో హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ప్రముఖ పాత్ర పోషించారు. అయితే గత కొన్ని రోజులుగా రిషబ్ శెట్టి ప్రవర్తిస్తున్న తీరు, వ్యవహార శైలి అభిమానులతో పాటు నెటిజన్‌లని షాక్‌కు గురి చేస్తోంది.
తన ఎదుగుదలకు కారకులైన వారితో పాటు తనతో కలిసి నటించిన వారిని కూడా అన్ ఫాలో చేస్తూ రిషబ్ షాక్ ఇవ్వడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నడ నాట కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముందు రాజ్ బి .శెట్టితో పాటు `కాంతార 2` హీరోయిన్ రుక్మిణి వసంత్‌లను అన్ ఫాలో చేసి షాక్ ఇచ్చిన రిషబ్ తాజాగా అదే తరహాలో వ్యవహరించి అభిమానులు విస్తూ పోయేలా చేశాడు. తాజాగా తాను ఫాలో అయ్యే వారందరినీ అన్ ఫాలో చేశాడు.
తన భార్యను, తన అఫీషియల్ అకౌంట్‌లని మాత్రమే ఫాలో అవుతున్నాడు. తనకు పాన్ ఇండియా గుర్తింపుని తెచ్చి పెట్టిన హోంబలే ఫిలింస్ అఫీషియల్ అకౌంట్‌ని అన్ ఫాలో కొట్టిన రిషబ్ నిన్ని మొన్నటి వరకు ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌ని ఫాలో అవుతూ వచ్చాడు. కానీ తాజాగా ఆయనని కూడా అన్ ఫాలో కొట్టడంతో నెట్టింట కాంతార హీరో అన్ ఫాలో గోలేంటనే చర్చ మొదలైంది. ఉన్నట్టుండి రిషబ్ ఎందుకు ఇలా వరుస అన్ ఫాలోలు కొడుతున్నాడు? అన్నది కన్నడ నాట ఊడా ఎవరికీ అంతుచిక్కడం లేదట.
దీనిపై రిషబ్ వివరణ ఇస్తే తప్ప అసలు సంగతి ఏంటన్నది బయటికి తెలిసే అవకాశం లేదని కన్నడ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే `కాంతార 2`లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం క్రేజీ సినిమాలని బ్లాక్ టు బ్యాక్ లైన్‌లో పెట్టాడు. ఇందులో ప్రశాంత్ వర్మ `జై హనుమాన్` ఒకటి. ఇందులో రిషబ్ హనుమంతుడిగా టైటిల్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ మూవీని రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్నారు.