సారీ చెబుతావా చెప్ప‌వా? RGVకి ఫెడ‌రేష‌న్ అల్టిమేట‌మ్!

వర్మ చేసిన వైరల్ ట్వీట్‌పై ఎఫ్‌.డ‌బ్ల్యూ.ఐ.సి.ఇ తీవ్రంగా స్పందించింది. ఫెడరేషన్ సీనియర్ సభ్యుడు అశోక్ పండిట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ...రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Update: 2026-06-05 05:18 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌కు ఎట్టకేలకు పెద్ద ఉపశమనం లభించింది. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం `డాన్ 3` నుండి రణవీర్ తప్పుకున్నాడనే కారణంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అతనిపై విధించిన స‌హాయ‌నిరాక‌ర‌ణ‌ (నిషేధ) నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ వివాదం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీయగా... ఫెడరేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో రణవీర్ సింగ్ చుట్టూ ఉన్న కారుమేఘాలు తొలగిపోయినట్లయింది.

ఈ నిషేధ ఉదంతంపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో తీవ్రస్థాయిలో స్పందించారు. రణవీర్ సింగ్‌ను సమర్థిస్తూ.. అసలు నిషేధించాల్సింది రణవీర్‌ను కాదు ఎఫ్‌.డ‌బ్ల్యూ.ఐ.సి.ఇ సంస్థను అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రణవీర్ వంటి స్టార్ల వల్లే లక్షలాది మంది సినీ కార్మికులకు ఉపాధి లభిస్తుందని... ఫెడరేషన్ వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఫెడరేషన్ ఒక `కంగారూ కోర్టు` లాంటిదని... ఇది కేవలం తన ఉనికిని చాటుకోవడానికి ప్రదర్శిస్తున్న కండబలమే తప్ప కార్మికుల సంక్షేమం కోసం కాదని వర్మ దుయ్యబట్టారు.

వర్మ చేసిన వైరల్ ట్వీట్‌పై ఎఫ్‌.డ‌బ్ల్యూ.ఐ.సి.ఇ తీవ్రంగా స్పందించింది. ఫెడరేషన్ సీనియర్ సభ్యుడు అశోక్ పండిట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ...రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎఫ్‌.డ‌బ్ల్యూ.ఐ.సి.ఇ అనేది ఒక బాధ్యతాయుతమైన సంస్థే తప్ప ఎవరినీ బెదిరించేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఫెడరేషన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ వర్మ తక్షణమే క్షమాపణ చెప్పాలని అశోక్ పండిట్ డిమాండ్ చేశారు.

ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఒక పాత వివాదాన్ని ఫెడరేషన్ తెరపైకి తెచ్చింది. సినీ సాంకేతిక నిపుణులకు వర్మ కోటి రూపాయలకు పైగా బకాయిలు పడ్డారని అశోక్ పండిట్ ఆరోపించారు. ఈ వివాదం 2017 నుండి నడుస్తోందని.. బకాయిలు చెల్లించడానికి సమయం కావాలని 2019 మార్చి వరకు గడువు కోరుతూ వర్మ స్వయంగా ఫెడరేషన్‌కు లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ డబ్బులు చెల్లించకుండా... ఫెడరేషన్‌ను విమర్శించడం సరికాదని మండిపడ్డారు.

ఏది ఏమైనా.. రణవీర్ సింగ్‌పై నిషేధం తొలగిపోవడంతో ఈ వివాదంలో ఒక కోణానికి తెరపడినట్లయింది. కానీ పరిశ్రమను శాసించే స్టార్ హీరోల నిర్ణయాలు, సినీ కార్మికుల హక్కులను రక్షించే యూనియన్ల పరిధులపై ఈ ఘటన మరోసారి ఆలోచింపజేసేలా చేసింది. స్టార్ పవర్ వర్సెస్ యూనియన్ పవర్ మధ్య జరిగే ఇలాంటి ఘర్షణలు పరిశ్రమ భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తాయో చూడాలి. ఇంత‌కీ ఆర్జీవీ కోటి బ‌కాయి ప‌డ్డార‌ని ఫెడ‌రేష‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తారా? లేక‌ బ‌కాయిలు క్లియ‌ర్ చేస్తున్నారా? దీనిపై ఆయ‌న ఏదైనా వివ‌ర‌ణ ఇస్తారా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News