పైరసీని ఆపాలంటే ఆ 'భయం' ఉండాల్సిందే: RGV
ఇప్పుడు 'ఐబొమ్మ రవి'ని 'రాబిన్ హుడ్' తో పోల్చడాన్ని RGV ఒక పెద్ద పొరపాటు అని కొట్టిపారేశారు.;
టాలీవుడ్ పైరసీ సమస్యపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన ఆలోచనలతో రంగంలోకి దిగారు. పైరసీ ఎప్పటికీ ఆగిపోదని వర్మ స్పష్టం చేశారు. ఎందుకంటే, ఇది టెక్నాలజీ లోపం వల్ల కాదు, దొంగలించిన కంటెంట్ చూసే జనం ఎక్కువ ఉన్నారు కాబట్టే. ఇప్పుడు 'ఐబొమ్మ రవి'ని 'రాబిన్ హుడ్' తో పోల్చడాన్ని RGV ఒక పెద్ద పొరపాటు అని కొట్టిపారేశారు.
వర్మ ఏమన్నారంటే, రాబిన్ హుడ్ హీరో కాదు, నేటి నిర్వచనాల ప్రకారం అతనో క్రిమినల్. డబ్బు ఉన్నవాడు ధనవంతుడు అవ్వడం అనేది దొంగతనం చేసి శిక్షించాల్సిన నేరం కాదు. అలాంటి ధనవంతుల్ని దోచుకుని ఇతరులకు పంచుతాననడం ఎంత దిగజారుడో చూపిస్తుందని ఆయన విమర్శించారు. దొంగిలించిన వస్తువులు ఉచితంగా తీసుకునేందుకే, ఒక నేరస్తుడిని గొప్ప వ్యక్తిలా ఆరాధించడం సరికాదని ఆయన అన్నారు.
ప్రేక్షకులు చెప్పే "టికెట్లు రేట్లు ఎక్కువ", "పాప్‌కార్న్ ఖరీదు ఎక్కువ" అనే లాజిక్ ని కూడా RGV తోసిపుచ్చారు. ఒక BMW కారు ఖరీదైతే, షోరూమ్ ని దోచుకుని పంచిపెట్టడం ఎలా తప్పు అవుతుందో, సినిమా ఖరీదైందని దొంగతనం చేయడం కూడా అంతే తప్పు.. ఆ రూల్ అన్ని వస్తువులకు వర్తిస్తుందని ఆయన అన్నారు. ఈ తరహా ఆలోచన సమాజంలో గందరగోళాన్ని పెంచి, పతనం వైపు తీసుకెళ్తుందని హెచ్చరించారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే.. ఈ పైరసీకి సినీ పరిశ్రమలోని వాళ్లే కూడా కారణమని వర్మ అన్నారు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు కూడా తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవడానికి పైరసీ కంటెంట్ చూస్తున్నారని ఆయన అంగీకరించారు. జనం పైరసీ చూసేది ఏదో పెద్ద నిరసన కోసం కాదు, కేవలం సౌలభ్యం కోసం మాత్రమేనని వర్మ స్పష్టం చేశారు.
పైరసీని ఆపడానికి ఒకే ఒక్క కఠినమైన పరిష్కారం ఉందని వర్మ సూచించారు. పైరసీ చేసేవాడిని పట్టుకోవడం కష్టం. అందుకే చూసే 'ప్రేక్షకుడిని' పట్టుకోవాలి. వంద మంది పైరసీ చూసే వారిని అరెస్ట్ చేసి, వారి పేర్లను పబ్లిక్ లో పెట్టాలని ఆయన సూచించారు.
భయం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని, మంచి మనసు కాదని అన్నారు. ఒక పైరసీ లింక్ చూడటం అనేది దొంగ సొత్తును స్వీకరించడం లాంటిదే అనే రియాలిటీని ఈ కఠిన చర్యల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆయన వాదించారు. ఈ ఎక్స్‌ట్రీమ్ పద్ధతే పైరసీని అంతం చేయడానికి ఏకైక మార్గమని RGV తేల్చిచెప్పారు. మరి ఆయన రియాక్షన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.