నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ తో సీఎం రేవంత్.. స్పెషల్ విషెస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించిన అనేక విషయాలపై ఇదివరకే పాజిటివ్ గా స్పందించారు.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించిన అనేక విషయాలపై ఇదివరకే పాజిటివ్ గా స్పందించారు. గద్దర్ అవార్డ్స్ తో ఇండస్ట్రీలోని టాలెంటెడ్ నటీనటులులను టెక్నీషియన్స్ ను ప్రశంసించారు. ఎప్పుడూ సినీ రంగంలోని ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుంటారని నిరూపించారు. ఇక హైదరాబాద్‌ను ప్రపంచ సినీ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న దృక్పథాన్ని ఆయన పదే పదే వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు సినీ ప్రముఖులను ఈరోజు తన నివాసంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ను భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా నిలబెట్టడం తన లక్ష్యమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వేతనాలు, సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాల వంటి అంశాలను చర్చించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించనుందని రేవంత్ తెలిపారు. ఆయన మాటల్లో నిజమైన ఆత్మీయత కనిపించిందని పాల్గొన్నవారు భావించారు.
సత్కారంలో భాగంగా భగవంత్ కేసరి సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హనుమాన్‌కు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన వెంకటేష్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వి, బేబీ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్, ప్రీమిస్తున్న పాటకు గాత్రం అందించిన గాయకుడు రోహిత్‌ను సీఎం సన్మానించారు. ప్రతి ఒక్కరికి పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు.
మొత్తానికి, జాతీయ స్థాయిలో తెలుగు సినీ ప్రతిభ వెలుగొందడం గర్వకారణమని, ఈ క్రమంలో ప్రతిభావంతులను గుర్తించి సత్కరించడం తన బాధ్యత అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సినిమా ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రభుత్వం తోడ్పడుతుందని హామీ ఇచ్చారు. ఈ సత్కార వేడుకతో సినీ పరిశ్రమకు సంబంధించిన మరికొందరు పాల్గొన్నారు.