రెండో పెళ్లిపై రేణు దేశాయ్ మనసు మాట!
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన రాజకీయ అరంగేట్రం, పిల్లల భవిష్యత్తు, ప్రేమ జీవితంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.;
టాలీవుడ్ ప్రముఖ నటి రేణు దేశాయ్ మరోసారి తన తన పర్సనల్ లైఫ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. ‘బద్రి’, ‘జానీ’ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ జంటగా నటించిన విషయం తెలిసిందే. అనంతరం ప్రేమించి, 2009లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల 2012లో విడిపోయారు. ఈ వివాహానికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య జన్మించారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ, పిల్లలపై తల్లిగా శ్రద్ధ తీసుకుంటున్నారు రేణు దేశాయ్.
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా, మళ్ళీ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు, ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన రాజకీయ అరంగేట్రం, పిల్లల భవిష్యత్తు, ప్రేమ జీవితంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయాలపై తనకు ఆసక్తి ఉన్నా, పిల్లల భద్రత కోసం గతంలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని, రాజకీయాల్లో తాను సరిపోవను అని పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలనేది తన మనసు మాటగా చెప్పారు. ఆమె చేసిన ముఖ్యమైన వ్యాఖ్యలో ఒకటి రెండో పెళ్లి గురించి. ‘‘చాలాసార్లు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించింది. కానీ నేను ఒంటరిగా జీవిస్తున్నా, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల జీవితంలోకి మరో వ్యక్తిని తీసుకురావడం చాలా సెన్సిటివ్ విషయం’’ అని చెప్పారు.
‘‘వ్యక్తిగతంగా చూస్తే నా జీవితంలో ఓ వ్యక్తి ఉండాలి, నాకు ప్రేమ కావాలి అనిపిస్తుంది. కానీ పిల్లల కోణంలో చూస్తే అది సాధ్యపడదు’’ అంటూ తల్లి బాధ్యతను కలగలిపారు. గతంలోనే రేణు దేశాయ్ ఒక పోస్ట్ ద్వారా తన చేతికి రింగ్ వేసిన ఫోటోను షేర్ చేశారు. ఆ సమయంలో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆ విషయం మీద ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో ఊహాగానాలే మిగిలిపోయాయి.
ఇప్పుడు ఈ కామెంట్స్ తో మళ్లీ ఆ చర్చలు తెరపైకి వచ్చాయి. అయితే ఆమె చెప్పిన మాటలు చూస్తే, తల్లిగా తన పిల్లలే మొదట ప్రాధాన్యం అనిపిస్తుంది. అలాగే తన కుమారుడు అకీరా నందన్ గురించి కూడా రేణు దేశాయ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అకీరా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో నటిస్తున్నారని, రామ్ చరణ్ నిర్మాణంలో అతడికి గ్రాండ్ లాంచ్ ఉంటుందని వచ్చిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని, అకీరా సినిమాల్లోకి వస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఒక తల్లిగా తన కొడుకును బిగ్ స్క్రీన్ పై చూడాలని తనకే ఎక్కువ ఆసక్తి ఉందని చెప్పినా, అతడిపై ఎలాంటి ఒత్తిడి చేయనని స్పష్టం చేశారు. ఏదేమైనా సినిమాల్లోకి రావడం అనేది అకిరా ఇష్టమని, అతను ఎలాంటి ప్రొఫెషనల్ ను ఎంచుకుంటాడు అనేది అతని ఇష్టమని ఆమె వివరణ ఇచ్చారు.