స్టార్ హోట‌ల్‌లో మంచు ల‌క్ష్మి చేదు అనుభ‌వం

స్టార్ హోట‌ల్స్ లో సెల‌బ్రిటీల అనుభ‌వాల గురించి చాలా క‌థ‌లు ఉన్నాయి. కొంద‌రికి తీయ‌నైన అనుభూతులు, మ‌రికొంద‌రికి చేదు అనుభ‌వాలు కూడా ఎదుర‌వుతుంటాయి.;

Update: 2026-02-08 04:32 GMT

స్టార్ హోట‌ల్స్ లో సెల‌బ్రిటీల అనుభ‌వాల గురించి చాలా క‌థ‌లు ఉన్నాయి. కొంద‌రికి తీయ‌నైన అనుభూతులు, మ‌రికొంద‌రికి చేదు అనుభ‌వాలు కూడా ఎదుర‌వుతుంటాయి. ఇప్పుడు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో మంచు లక్ష్మికి ఎదురైన చేదు అనుభవం గురించి వార్తా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. తన‌కు ఎదురైన ఈ చేదు అనుభ‌వంపై ఆవేద‌న చెందుతూ మంచు ల‌క్ష్మి సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేసిన ఒక వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.




 


అస‌లు హోటల్‌లో అసలు ఏం జరిగింది? అంటే.. మంచు లక్ష్మి ఒక సినిమా ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లినప్పుడు గ్రీన్ పార్క్ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. ఆమె తనతో పాటు తన కెమెరామెన్‌ను లోపలికి తీసుకెళ్లగా, హోటల్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. హోటల్ రూమ్‌లోకి కెమెరాలను అనుమతించబోమని రిసెప్షనిస్ట్ చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఈ హోట‌ల్ స్టాండార్డ్స్ ని మెచ్చుకున్న మంచు ల‌క్ష్మి త‌న‌కు ఎదురైన ఇబ్బంది గురించి సిబ్బందిపై విరుచుకుప‌డ్డారు.

తాను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హోటళ్లకు వెళ్లానని, ఎక్కడా ఇలాంటి నిబంధనలు చూడలేదని మంచు ల‌క్ష్మి ఈ వీడియోలో పేర్కొన్నారు. కనీసం చిన్న కెమెరాను కూడా అనుమతించక‌పోగా.. సిబ్బంది ప్రవర్తనపై సోషల్ మీడియాలో వీడియో ద్వారా అసహనం వ్యక్తం చేశారు. క‌నీసం కెమెరామెన్ కోసం వేరొక రూమ్ అడిగినా దానికి స‌హ‌క‌రించ‌లేద‌ని కూడా మంచు ల‌క్ష్మి ఆవేద‌న చెందారు. అంతేకాదు.. త‌న కెమెరా సిబ్బంది గ‌తంలో అదే హోట‌ల్ లో దిగి ఫోటోలు దిగార‌ని కూడా మంచు ల‌క్ష్మి కొన్ని ఆధారాల్ని చూపించే ప్ర‌య‌త్నం చేసారు.

ముంబైలో నివాసం:

మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితమే హైదరాబాద్ నుండి ముంబైకి షిఫ్ట‌య్యారు. తన అభిరుచికి తగ్గట్టుగా ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను తీసుకుని నివ‌శిస్తున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. అప్పుడప్పుడు వృత్తిపరమైన పనుల కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ముంబైలో త‌న స్నేహితురాళ్లు అయిన ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌గ్య జైశ్వాల్ వారి కుటుంబాల‌తో క‌లిసి వెకేష‌న్ల‌కు వెళుతూ మంచు ల‌క్ష్మి చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా గ‌తంలో వైర‌ల్ అయ్యాయి.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు? సినిమాల వివరాలను ఆరా తీస్తే... ల‌క్ష్మీ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గ‌త ఏడాది `ద‌క్ష` అనే చిత్రం విడుద‌లైంది. ఇందులో ఒక‌ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. `ఆదిపర్వం` అనే భారీ గ్రాఫిక‌ల్ పీరియడ్ డ్రామాలోను ల‌క్ష్మీ మంచు న‌టించిన సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలో `వూకీ` అనే చిత్రంలో న‌టించారు. ఫిబ్రవరి 13న‌ ఈ చిత్రం విడుద‌ల కానుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప‌లు షోలలోను మంచు ల‌క్ష్మి కనిపిస్తున్నారు.

Tags:    

Similar News