72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా!
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా పడింది.
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా పడింది. మీడియా కథనాల ప్రకారం జూలై 3వ తేదీనే విజేతల వివరాలు వెల్లడి కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రకటన ఆలస్యమైంది. ఈ నెల (జూలై) ఆఖరి నాటికి విజేతలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించినా, మరో వారంలోనే ప్రకటన ఉంటుందని తాజా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే అవార్డుల ప్రకటనకు సంబంధించిన కచ్చితమైన తేదీని జ్యూరీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 2024 వ సంవత్సరంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలను ఈసారి అవార్డుల కోసం పరిశీలిస్తున్నారు. అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి ఉండాలని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని జూరీ మీడియాను కోరింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీలో ఎవరెవరు ఉన్నారు? అంటే..ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించింది. జయరాజ్ గతంలో 2012లో కూడా జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీలో సభ్యుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించిన తర్వాత.. ఈ కమిటీ ఈ ఏడాది విజేతలను ఖరారు చేసింది.
ఈ అవార్డుల ప్రకటన ఆలస్యమవడంతో సినిమా ప్రేమికుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఫలితాలు రాకముందే సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమకు నచ్చిన నటీనటులకు మద్దతుగా పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ హారర్ డ్రామా `భ్రమయుగం`లో కనబరిచిన అద్భుత నటనకు గానూ అవార్డు అందుకోవాలని నెటిజన్లు బలంగా కోరుకుంటున్నారు. ఆయన పాత్రలోని వైవిధ్యం, నటన సినిమా విమర్శకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మమ్ముట్టితో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన `ది గోట్ లైఫ్` (ఆడుజీవితం) సినిమా కోసం ఆయన పడిన శారీరక, మానసిక కష్టం అంతా ఇంతా కాదు. ఈ పాత్ర కోసం అతడు పూర్తిగా మారిపోయిన తీరుకు జాతీయ అవార్డు దక్కాల్సిందేనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు గతంలోనే `పుష్ప: ది రైజ్` సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అతడి నటన, డెడికేషన్‌కు మరోసారి జాతీయ గుర్తింపు రావాలని వారు ఆశిస్తున్నారు.
ఉత్తమ నటి కేటగిరీలో కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. `అమరన్` చిత్రంలో తన భావోద్వేగ నటనతో ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తెప్పించిన సాయి పల్లవి ఈ రేసులో ముందంజలో ఉంది. ఈ మలయాళ కుట్టీకి ఈసారి కచ్చితంగా అత్యున్నత పురస్కారం దక్కాలని నెటిజన్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. భావోద్వేగాలను పండించడంలో సాయి పల్లవి చూపించిన ప్రతిభకు జాతీయ అవార్డే సరైన గుర్తింపు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నటన విభాగాలతో పాటు సాంకేతిక విభాగాల్లోనూ ఈసారి సౌత్ సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తోంది. టాలీవుడ్ విజువల్ వండర్ `కల్కి 2898 AD` చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) .. ఇతర సాంకేతిక విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమోషనల్ కథాంశంతో మెప్పించిన `అమరన్` చిత్రంతో పాటు, `దేవరా` సినిమాలోని `ఆయుధ పూజ` పాట కూడా అవార్డు రేసులో నిలిచింది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఈ ఏడాది జాతీయ అవార్డుల విజేతలు ఎవరో తెలియాలంటే ప్రేక్షకులు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.