సెన్సార్ షాక్: సూపర్‌స్టార్ సినిమాకి పదే పదే విఘ్నాలు- కష్టాలు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తాజా వార్ డ్రామా 'మాతృభూమి' సినిమా ఇలాంటి చిక్కుల్లోనే ఉంది.
ఇటీవలి కాలంలో సినిమాలు లేదా వెబ్ సిరీస్ ల కథలు, పాత్రలు లేదా కంటెంట్ ఎంపికల పరంగా చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏవైనా మతపరమైన భావోద్వేగాలు, కమ్యూనిటీ అంశాలలోనే కాకుండా దేశ సరిహద్దులకు సంబంధించిన కథలు లేదా స్క్రిప్టులను ఎంపిక చేసుకున్నా... సెన్సార్ పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తాజా వార్ డ్రామా `మాతృభూమి` సినిమా ఇలాంటి చిక్కుల్లోనే ఉంది. ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరించాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అకస్మాత్తుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో విసుగెత్తిన భారత్.. ఆలోచనలు మార్చుకుని శత్రుదేశం చైనాతో స్నేహాన్ని, సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో అది సల్మాన్ బృందానికి కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టింది. అప్పటివరకూ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అంటూ చైనా బార్డర్ లోని గల్వాన్ లోయ విధ్వంసకాండపై సినిమా తీసిన సల్మాన్ బృందం భారతదేశాన్ని హీరోని చేసే అవకాశం లేకుండా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో స్క్రిప్టు మొత్తాన్ని రీఫ్రెష్ చేసి టైటిల్ ని `మాతృభూమి` అని మార్చి.. చాలా సన్నివేశాలను రీషూట్లు చేయాల్సి వచ్చింది.
ఈ వివరాలకు సంబంధించి మరింత డెప్త్ గా వెళితే.. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో సల్మాన్ ఖాన్ 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు పాత్రను పోషించారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటించగా.. హిమేష్ రేషమియా సంగీతం అందించారు. మొదట ఈ ఏడాది ఈద్ కానుకగా ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ (ఆగస్టు) కి వాయిదా పడింది. కానీ ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో ఆగస్టు రేసు నుండి కూడా ఈ సినిమా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే టీజర్ గతేడాది డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాగా అప్పటి నుండి వివాదాలు చుట్టుముట్టాయి. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ `వైబో`లో అక్కడి నెటిజన్లు ఈ ప్రాజెక్ట్‌ను తీవ్రంగా విమర్శించారు. గల్వాన్ ఘర్షణల్లో జరిగిన అసలు నిజాలను ఈ సినిమాలో వక్రీకరించి చూపిస్తున్నారంటూ ఆరోపించారు. అంతర్జాతీయంగా ఈ వివాదం చెలరేగడంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఏ) దీనిపై స్పందిస్తూ.. భారతదేశంలో సినిమాల విడుదలకు సంబంధించిన విషయాలను సంబంధిత సెన్సార్ అధికారులు చూసుకుంటారు. ఇందులో విదేశాంగ శాఖకు ఎలాంటి సంబంధం లేదు! అని స్పష్టం చేస్తూ ఈ వివాదం నుండి తప్పుకుంది.
అయినా అంతర్జాతీయ సంబంధాలు, సున్నితమైన సరిహద్దుా వివాదాలు, దౌత్య సంబంధాల నేపథ్యంలో ఎందుకు వచ్చిన గొడవ అని భావించిన మేకర్స్.. సినిమా టైటిల్‌ను `బాటిల్ ఆఫ్ గల్వాన్` నుండి `మాతృభూమి`గా మార్చారు. కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసారు.
సమస్యలు అక్కడితో వదిలిపోలేదు. చాలా డబ్బు, శ్రమ వృధా పోయినా చివరికి రిలీజ్ ముంగిట కూడా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు మాతృభూమి చిత్రానికి విడుదలకు ముందే సరికొత్త చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. `బాటిల్ ఆఫ్ గల్వాన్` టైటిల్‌ను మార్చినా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమా క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ వెల్లడించింది. దీనివల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అనేదానిపై తీవ్ర సందిగ్ధత నెలకొందని సదరు చానెల్ కథనం పేర్కొంది.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన `సికందర్` డిజాస్టర్ అయిన తర్వాత సల్మాన్ ఖాన్ మాతృభూమి కోసం తీవ్రంగా శ్రమించారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మక దేశభక్తి చిత్రం కావడంతో భారీ అంచనాలేర్పడ్డాయి. కానీ సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు `మాతృభూమి` థియేటర్లలోకి రావడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సార్ ఇచ్చిన షాక్ తో ఈ సినిమాని విదేశాంగ శాఖ కూడా సమీక్షిస్తుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. చిత్రబృందం నుంచి మరింత అధికారిక సమాచారం వస్తుందేమో చూడాలి.