'మెగా సూప‌ర్ గుడ్' నిర్మాత‌గా ఆయ‌న ఎందుకు పాపుల‌ర్?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పాపుల‌ర్ నిర్మాతగా వెలుగొందిన ఆర్.బి. చౌదరి కేవలం వెండితెరకే పరిమితం కాలేదు.;

Update: 2026-05-05 18:05 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పాపుల‌ర్ నిర్మాతగా వెలుగొందిన ఆర్.బి. చౌదరి కేవలం వెండితెరకే పరిమితం కాలేదు. సినిమా రంగంలోకి ప్రవేశించకముందే ఆయన వాణిజ్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా స్టీల్ వ్యాపారం, ఎగుమతులు, జువెలరీ రంగాలలో ఆయన రాణించి పటిష్టమైన ఆర్థిక పునాదిని నిర్మించుకున్నారు. ఈ వ్యాపార నేపథ్యం.. అనుభవంతోనే ఆయన తొలుత మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

ఆర్.బి. చౌదరి తన మాతృ సంస్థ `సూపర్ గుడ్ ఫిలింస్` ద్వారా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాలను నిర్మించారు. అయితే మెగా హీరోలతో ఉన్న ప్రత్యేక అనుబంధం.. వ్యాపార భాగస్వామ్యం కారణంగా ఆయన `మెగా సూపర్ గుడ్ ఫిలింస్` అనే మరో బ్యానర్‌ను కూడా ప్రారంభించారు. ఈ బ్యానర్‌ను ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాల నిర్మాణం.. పంపిణీ కోసం ఒక బ్రాండ్‌గా ఉపయోగించుకున్నారు.

మెగా కాంపౌండ్‌తో చౌదరికి ఉన్న బంధం ఎంతో గట్టిది. ఈ బ్యానర్‌పైనే చిరంజీవి నటించిన `స్నేహం కోసం` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందాయి. ఇటీవలే 2022లో మెగాస్టార్ హీరోగా వచ్చిన `గాడ్ ఫాదర్` చిత్రాన్ని కూడా ఎన్.వి. ప్రసాద్‌తో కలిసి ఆర్.బి. చౌదరి ఇదే బ్యానర్‌పై నిర్మించడం విశేషం. స్థానిక పంపిణీదారులు.. ఇతర నిర్మాతలతో కలిసి పెద్ద సినిమాలను నిర్మించే క్రమంలో ఈ బ్యానర్ ఒక విజయవంతమైన వేదికగా నిలిచింది.

నిర్మాతగానే కాకుండా పంపిణీ రంగంలో కూడా ఆర్.బి. చౌదరి ఒక దిగ్గజం. రాయలసీమ వంటి కీలక ప్రాంతాలలో ఆయనకు అత్యంత పటిష్టమైన పంపిణీ నెట్‌వర్క్ ఉండేది. అందుకే మెగా హీరోలు తమ సినిమాల పంపిణీ బాధ్యతలను ఆయనకు అప్పగించి ప్రోత్సహించేవారు. ఆయనలోని వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ.. సినిమాలపై ఉన్న అంకితభావం మెగా కాంపౌండ్ ఆయనకు వరుస అవకాశాలు ఇవ్వడానికి ప్రధాన కారణాలయ్యాయి.

ఆర్.బి. చౌదరి మరణం భారతీయ సినీ రంగానికి, ముఖ్యంగా మెగా కాంపౌండ్‌కు తీరని లోటు. ఆయనను అత్యంత క్రమశిక్షణ గల నిర్మాతగా.. దైవ సమానుడుగా పరిశ్రమ వర్గాలు కొనియాడతాయి. వ్యాపారవేత్తగా ఆయనకున్న మెళకువలు, కథలను ఎంచుకోవడంలో ఆయనకున్న ప్రావీణ్యం వెండితెరపై ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించాయి. ఆర్.బి.చౌద‌రి అందించిన విజయవంతమైన చిత్రాలు తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Tags:    

Similar News