సిస‌లైన మాస్ కోసం రాయ‌ల‌సీమ వెయిటింగ్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాయలసీమ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

Update: 2026-07-19 19:09 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాయలసీమ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ ప్రాంతపు యాస, పౌరుషం, కక్షలు, ప్రేమ.. ఇవన్నీ కలిసి వెండితెరపై అద్భుతమైన మాస్ జాతరను సృష్టిస్తాయి. అయితే గత కొంతకాలంగా రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ప్రామాణికమైన మాస్ సినిమాలు కరువయ్యాయన్న‌ది వాస్త‌వం. ఇక్కడి ప్రేక్షకులు ఆ సిసలైన, కళ్లముందు కదలాడే సీమ పోరాటాలను, ఆ తీవ్రతను చూడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్రనటులు సీమ ఫ్యాక్షన్ కథలతో థియేటర్లను ఊపేసిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలు కూడా ఆ బాణీలో అద్భుతమైన చిత్రాలను అందించి సీమ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కానీ ఆ తర్వాత కాలక్రమేణా ఆ జానర్ సినిమాల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు వస్తున్న సినిమాలు యాక్షన్ సీక్వెన్స్‌లకు పరిమితం అవుతున్నాయి తప్ప ఆ ప్రాంతపు అసలైన సీమ మాస్ ఎమోషన్‌ను పండించలేకపోతున్నాయి. ప్రస్తుత తరం హీరోలు ఎవరూ కూడా ఆ జానర్ వైపు అడుగులు వేయడానికి సాహసించడం లేదు. అందరూ క్లాస్ .. కమర్షియల్ ఎంటర్టైనర్ల వైపే మొగ్గు చూపుతుండటంతో? రాయలసీమ ప్రేక్షకుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.

కథలో ఉండే గాఢత, పాత్రల మధ్య ఉండే పౌరుషం, ఆ ప్రాంతపు మట్టి వాసన తెలిసిన కమర్షియల్ మాస్ సినిమా కోసం థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సీమ పల్స్ తెలిసిన ఓ పవర్ ఫుల్ డైరెక్టర్ కోసం అక్కడ అభిమానులు ఆరాటపడుతున్నారు. కత్తులు, బాంబులే కాకుండా, మనుషుల మధ్య ఉండే బలమైన భావోద్వేగాలను సీమ బ్యాక్‌డ్రాప్‌లో చూపించే సినిమాలే కాలపరీక్షను తట్టుకుని నిలబడతాయి. అలాంటి కథలు రాయలసీమ గడ్డ మీద ఎన్నో ఉన్నా? వాటిని వెండితెరపైకి తీసుకురావడానికి సరైన కృషి జరగడం లేదు. నిర్మాతలు బడ్జెట్ విషయంలోనూ హీరోలు ఇమేజ్ విషయంలోనూ భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

కానీ సరైన కంటెంట్‌తో వస్తే ఆ ప్రాంతపు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో బ్రహ్మరథం పడతారో చెప్పాల్సిన ప‌నిలేదు.నిజానికి రాయలసీమ నేపథ్యంలో వచ్చిన పాత సినిమాలు కూడా ఇప్ప‌టికీ టీవీల్లో వస్తుంటే సీమ‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అంటే వారి ఆకలి తీరలేదని అర్ద‌మ‌వుతుంది. కొత్త తరహాలో నేటి ప్రేక్షకులకు నచ్చేలా ఆ సీమ మాస్ అంశాలను జోడిస్తే కచ్చితంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించగలవు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు గ్రహించి బలమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోయ‌పా శ్రీను , గోపీచంద్ మ‌లినేని, బాబి లాంటి మాస్ సంచ‌ల‌నాలు సీమ వైపు ఓ లుక్కేస్తే బాగుంటుంద‌నే మాట వినిపిస్తోంది.

చివ‌రిగా రాయలసీమ అభిమానులు కోరుకునే మాస్ అంటే కేవలం హింస మాత్రమే కాదు. అదొక‌ సంస్కృతి, ఒక ఆవేశం. ఆ ప్రాంతపు మట్టిలో ఉన్న గొప్పతనాన్ని ప్రతిబింబించే కథలను వెండితెరపై ఆవిష్కరిస్తే? టాలీవుడ్‌కు గొప్ప కళాఖండం దక్కుతుంది. సీమ మాస్ కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది అభిమానుల కోసం మళ్ళీ ఆ జోరును, ఆ పౌరుషాన్ని తెరపైకి తెచ్చే ధైర్యవంతుడు ఎవ‌ర‌వుతారో చూడాలి.

Tags:    

Similar News