నాని డైరెక్టర్‌తో ట్రాక్ మారుస్తున్న మాస్ రాజా!
ఓటీటీల ప్రభావం తరువాత ప్రేక్షకుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.;
ఓటీటీల ప్రభావం తరువాత ప్రేక్షకుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డిజిట్ ప్లాట్ ఫామ్‌ల వాడకం పెరిగిన తరువాత ప్రపంచ నలుమూల కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తోంది. దీంతో నచ్చిన వాటికి మాత్రమే ఆడియన్స్ పట్టం కడుతున్నారు. ఆదరిస్తున్నారు. దీంతో హీరోల్లో జాగ్రత్త మొదలైంది. కథల ఎంపిక విషయంలో హీరోలు, డైరెక్టర్లు చిన్న పొరపాటు చేసినా బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
దీంతో ప్రతి సినిమా స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త తరహా కంటెంట్‌లకే పెద్ద పీట వేస్తూ తమ పంథాకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. మాస్ మహారాజా కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాలతో మాస్ మహారాజా అనిపించుకున్న రవితేజ ఇప్పుడు తన మార్కు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే కథలని ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సంక్రాంతికి రవితేజ చేసిన మూవీ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు.
అషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్‌లుగా నటించారు. ఇద్దరు భామల మధ్య నలిగే యువకుడిగా రవితేజ ఇందులో నటించాడు. పక్కా ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ జనవరి 13న విడుదలై ఫరవాలేదు అనిపించుకుంది. ఈ మూవీతో కొత్త అడుగు వేసిన రవితేజ మరో సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ తరువాత రవితేజ కొత్త జోనర్‌ని ట్రై చేయబోతున్నాడట. ఇంత వరకు టచ్ చేయని హారర్ థ్రిల్లర్ జోనర్‌తో తన తదుపరి మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడని తెలిసింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇటీవలే మాస్ మహారాజా రవితేజకు స్క్రిప్ట్ వినిపించాడని, తనకు ఎంతగానో స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని టీమ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. వివేక్ ఆత్రేయ హీరో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా యాక్షన్ డ్రామా `సరిపోదా శనివారం` మూవీని రూపొంది బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
2024, ఆగస్టు 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో రూ.100 కోట్లు రాబట్టింది. క్యారెక్టర్ డ్రైవెన్ మూవీగా వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ కావడంతో తదుపరి మూవీ మరింత భారీగా ఉంటుందని అంతా భావించారు. కానీ టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఖాళీగా లేకపోవడంతో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి వివేక్ ఆత్రేయకు ఇంత టైమ్ పట్టిందని, ఇప్పటికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తనతో నెవర్ బిఫోర్ అనే తరహాలో హారర్ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.