చావు అంచుల నుంచి చార్ట్‌బస్టర్ వరకూ… రవి బస్రూర్ జీవితంలో ఆ ఇద్దరు వ్యక్తులు!
ఈ వేదికపై రవి బస్రూర్ తన జీవితంలోని అత్యంత విషాదకరమైన విషయాన్ని పంచుకున్నారు.;
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. 'కేజీఎఫ్' మ్యూజిక్‌తో దేశాన్ని ఊపేసిన రవి బస్రూర్ జీవితంలో కూడా అలాంటి చీకటి రోజులే ఉన్నాయి. తాజాగా విశ్వక్ సేన్ నటించిన ‘కల్ట్’ టీజర్ లాంచ్‌లో రవి బస్రూర్ తన ఆత్మహత్య ప్రయత్నాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. మరోవైపు విశ్వక్ సేన్ ఇదే వేదికపై రవి ప్రతిభను గుర్తించి ఖరీదైన 'రోలెక్స్ గోల్డ్ వాచ్' గిఫ్ట్ గా ఇచ్చారు.
విశ్వక్ సేన్ ‘కల్ట్’ గిఫ్ట్.. రోలెక్స్ వాచ్ వెనుక ఉన్న సోల్:
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్ట్’ టీజర్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ ఇంత పవర్‌ఫుల్‌గా రావడానికి ప్రధాన కారణం రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. "నా సినిమాకు రవి గారు ఒక కన్ను లాంటి వారు" అని పొగిడిన విశ్వక్, ఆయన మ్యూజిక్ నచ్చి ఏకంగా రెండేళ్లు వెయిట్ చేసి మరీ ఒక ఖరీదైన 'రోలెక్స్ గోల్డ్ వాచ్'ను గిఫ్ట్‌గా ఇచ్చారు. స్టేజిపైనే రవికి ఆ వాచ్‌ను చేతికి తొడిగారు. ఇక 25 ఏళ్ల కెరీర్‌లో తన మ్యూజిక్‌ను మాత్రమే చూశారని, కానీ మొదటిసారి తన ఆత్మను (సోల్) చూసిన వ్యక్తి విశ్వక్ సేన్ అని రవి బస్రూర్ ఎమోషనల్ అయ్యారు.
ఆత్మహత్య ప్రయత్నాలు.. ఆ పేరు వెనుక అసలు కథ:
ఈ వేదికపై రవి బస్రూర్ తన జీవితంలోని అత్యంత విషాదకరమైన విషయాన్ని పంచుకున్నారు. 18 ఏళ్ల వయసులో బతకడం భారమై.. రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారట. ఆ సమయంలో తనను కాపాడిన 'రవి' అనే వ్యక్తి, కీ-బోర్డ్ కొనుక్కోమని రూ.35 వేలు ఇచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఆ కృతజ్ఞతతోనే తన సొంత పేరును పక్కన పెట్టి, ఆ వ్యక్తి పేరును కలుపుకుని 'రవి బస్రూర్'గా మార్చుకున్నానని తెలిపారు. ఇక తనకు ప్రాణం పోసిన రవి, తన ప్రతిభను ప్రపంచానికి చాటిన విశ్వక్ సేన్.. ఈ ఇద్దరినీ జీవితంలో మర్చిపోలేనని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన ‘కల్ట్’:
ఇక సినిమా విషయానికి వస్తే, విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో గమనించి ఈ సినిమా తీశానని ఆయన చెప్పారు. అయితే ఈ సినిమా చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, అందుకే పిల్లలను, కుటుంబ సభ్యులను ఈ మూవీకి దూరంగా ఉంచాలని ముందే వార్నింగ్ ఇచ్చారు. గుండె బలహీనంగా ఉన్నవారు రావొద్దని చెబుతూనే, సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని భరోసా ఇచ్చారు. రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని విశ్వక్ ప్రశంసల వర్షం కురిపించారు.