సినిమా హిట్... దర్శకుడికి తిట్లు..!
టాలీవుడ్‌లో విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా రవిబాబుకు మంచి పేరుంది.;
టాలీవుడ్‌లో విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా రవిబాబుకు మంచి పేరుంది. నటుడిగా, దర్శకుడిగా రవిబాబు టాలీవుడ్‌లో సుపరిచితుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఏనుగు తొండం ఘటికాచలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ మూవీ ప్రమోషన్‌లో భాగంగా రవిబాబు చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. నటుడిగానూ ఎక్కువ సినిమాలు చేయని రవిబాబు ఈ మధ్య ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. తన దర్శకత్వంలో కాకున్నా తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఓటీటీ సినిమాలు, సిరీస్‌లను రవిబాబు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో తన గత చిత్రాల అనుభవాలను రవిబాబు షేర్ చేసుకున్నాడు.
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మూవీ...
ఏనుగు తొండం ఘటికాచలం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ... తాను రూపొందించిన అవును సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, కొందరు ఆ సినిమాను చూసిన తర్వాత తనను తిట్టినట్టు రవిబాబు చెప్పుకొచ్చాడు. సినిమా పోస్టర్ లో ఉన్నట్లుగా సినిమాలో ఏనుగును చూపించక పోవడంతో కొందరు నిరుత్సాహం కి గురి అయ్యారు. దాంతో వారు నన్ను తిట్టుకున్నారు అంటూ రవిబాబు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా రాజమండ్రి నుంచి ఒక వ్యక్తి అవును సినిమాను చూసిన తర్వాత ఇష్టానుసారంగా తిట్టేశాడట. పోస్టర్‌లో ఏనుగులను చూపించారు కనుక, సినిమాలో ఏనుగులు ఉంటాయని అనుకుని, పిల్లలను తీసుకుని సినిమాకు వెళ్లాను. తీరా అక్కడ సినిమాలో ఏనుగు లేకపోవడంతో పిల్లలు చాలా డిస్సపాయింట్ అయ్యారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏనుగు తొండం ఘటికాచలం సినిమా...
పోస్టర్‌లో తాను చూపించింది మెటాఫర్ అని చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆయన తిట్టాలి అనుకున్నది తిట్టేసి, కసురుకుని, తన మాటలు వినకుండానే ఫోన్ పెట్టేశాడు. సినిమా చూసిన తర్వాత అతడు నా నెంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేసి సినిమాలో ఏనుగులు ఎక్కడ అంటూ ప్రశ్నించాడంటే అతడు ఎంతగా నిరుత్సాహం కు గురి అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. అలా చాలా మంది 'అవును' ఏనుగులు ఎక్కడ అంటూ ప్రశ్నించారు అని రవిబాబు అన్నాడు. హీరోయిన్ దెయ్యంతో పీడించబడుతుంది అనే విషయాన్ని చెప్పడానికి ఏనుగును దెయ్యంగా చూపించాను. పోస్టర్ లో ఏనుగును చూపించడం ద్వారా చాలా మంది ఇందులో ఏనుగులు ఉంటాయేమో అనుకున్నారు. చాలా మంది ఏనుగు సీన్ ను సినిమాలో షూట్ చేసి, చివరకు తీసి వేసినట్లుగా అనుకున్నారు. కానీ అసలు ఏనుగు సీన్ ఉండదు అని రవిబాబు క్లారిటీ ఇచ్చాడు.
పూర్ణ హీరోయిన్‌గా నటించిన అవును మూవీ..
పూర్ణ హీరోయిన్‌గా నటించిన ఆ హర్రర్ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రవిబాబు ఆ సినిమాతో దర్శకుడిగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆయన దర్శకత్వంలోని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అవును సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా వచ్చిన అవును 2 సినిమా సైతం ఆకట్టుకోలేదు. దాంతో రవిబాబు సినిమాల సంఖ్య తగ్గిస్తూ వచ్చాడు. ముఖ్యంగా సినిమాల ఎంపిక విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాడు. నటుడిగానూ ఆయన ఎంపిక తక్కువ అయింది. గతంలో స్క్రీన్ పై రెగ్యులర్‌గా కనిపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు కనిపించడం లేదు. ఏనుగు తొండం ఘటికాచలం సినిమాలో చిన్న పోలీస్ పాత్రలో కనిపించాడు. ఉన్నంతలో నవ్వించాడని విమర్శకులు తమ రివ్యూల్లో పేర్కొన్నారు.