ఆడియ‌న్స్‌కు అంత టైమ్ ఉందా? ప్రమోషన్స్‌పై రవిబాబు సంచలన కామెంట్స్

టాలీవుడ్‌లో ఎప్పుడూ తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించే డైరెక్ట‌ర్ ర‌విబాబు మరోసారి తన ముక్కుసూటి వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు.;

Update: 2026-05-09 17:40 GMT

టాలీవుడ్‌లో ఎప్పుడూ తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించే డైరెక్ట‌ర్ ర‌విబాబు మరోసారి తన ముక్కుసూటి వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. వైవిధ్యమైన కథలు, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవిబాబు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా రేజ‌ర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో పెరుగుతున్న ప్రమోషనల్ హడావిడి, టీజర్- ట్రైలర్ కల్చర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇప్పుడు టీజర్, ట్రైలర్, ట్రైజర్ అంటూ కొత్త ట్రెండ్స్ వస్తున్నాయ‌ని స‌దరు యాంక‌ర్ ప్రస్తావించగా, దానికి రవిబాబు తనదైన శైలిలో స్పందించారు. టీజర్‌కు ముందు ప్రీ టీజర్, దానికి ముందు గ్లింప్స్, ఆ గ్లింప్స్‌కు ముందే అనౌన్స్‌మెంట్, చివరకు ఆ అనౌన్స్‌మెంట్ డేట్‌కే మరో డేట్ పెట్టడం వరకు వెళ్తున్నారు. ఇలా ప్రమోషన్స్‌ను పెంట పెంట చేసేశారంటూ వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు తమ పనులు మానేసి సినిమా అప్‌డేట్స్ కోసమే ఎదురు చూస్తున్నారని భావించడం సరైన ఆలోచన కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎవరి జీవితంలో వాళ్లు బిజీగా ఉంటారు. ఒక ట్రైలర్ వస్తే నేరుగా రిలీజ్ చేయొచ్చు కదా! ఎందుకు అంత హడావిడి? అని ఆయ‌న ప్రశ్నించారు.

సినిమా పై హైప్ ను పెంచ‌డానికే మేక‌ర్స్ అలా ప్ర‌మోట్ చేస్తున్నార‌ని యాంక‌ర్ అంటుంటే, అస‌లు ఈ నార్మ్స్ అన్నీ ఎవరు పెట్టారు? అంటూ ప్రశ్నించిన రవిబాబు, ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రమోషన్స్ పేరుతో జరుగుతున్న అతిశయోక్తి ట్రెండ్‌పై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న అప్‌డేట్‌ను భారీ ఈవెంట్‌లా మార్చడం వల్ల అసలు కంటెంట్‌పై ఫోకస్ తగ్గిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంద‌ని ఆయ‌న అన్నారు.

సీనియర్ నటుడు దివంగత చ‌ల‌ప‌తి రావు కుమారుడిగా సినీ పరిశ్రమలోకి వచ్చిన రవిబాబు, డైరెక్ట‌ర్ గా మాత్ర‌మే కాకుండా నటుడిగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అవును, అల్లరి, అనసూయ, అమరావతి వంటి భిన్నమైన సినిమాల‌తో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పరచుకున్నారు. రవిబాబు సినిమా అంటే సాధారణ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా ఏదో కొత్తదనం ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది.

Tags:    

Similar News