ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో గుబులు గుబులుగా నటి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత బాలీవుడ్ నటి రవీనా టాండన్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ హృదయాలను బరువెక్కేలా చేసింది.;
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత బాలీవుడ్ నటి రవీనా టాండన్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ హృదయాలను బరువెక్కేలా చేసింది. ''ఎప్పటికీ మర్చిపోలేని గాయమది..'' అంటూ ఎమోషనల్ అయిన రవీనా టాండన్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ ఈ పోస్ట్ ని షేర్ చేసారు. రవీనా విమానంలో విండో సీట్ లో కూచుని ప్రయాణిస్తున్నారని తను షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ చెబుతోంది.
'కొత్త ప్రారంభాలు..' అంటూ టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానానికి బాసటగా ఈ పోస్ట్ నిలిచింది. ఈ పోస్ట్ పూర్తి సారాంశం ఇలా ఉంది. ''కొత్త ప్రారంభాలు... అన్ని అసమానతలకు వ్యతిరేకంగా లేచి మళ్ళీ ఎగరడానికి... తిరిగి ప్రారంభించి, మరింత బలం వైపు కొత్త సంకల్పం'' అని కవితాత్మకంగా రాశారు. ఒక ఘోర ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణీకుల మనోభావాలు ఎలా ఉంటాయో తన పోస్ట్ ప్రతిధ్వనించింది. విమాన వాతావరణం ఎలా ఉందో తన పోస్ట్ వెల్లడించింది. గంభీరమైన వాతావరణం ... స్వాగతించే సిబ్బంది చిరునవ్వుల స్థానంలో విచారం నిండి ఉందని, నిశ్శబ్ద ప్రయాణీకులు..సిబ్బంది చెప్పని సంతాపం కనిపిస్తోందని రవీనా సోషల్ మీడియాలో రాసారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ రవీనా తన నోట్‌ను ముగించారు. ''ఎప్పటికీ నయం కాని గాయం. ఎల్లప్పుడూ ఎయిర్ ఇండియా గాడ్ స్పీడ్. భయాన్ని అధిగమించి మళ్ళీ బలంగా ఉండాలనే సంకల్పం కనిపిస్తోంద'' ని రవీనా రాసారు.
జూన్ 12న అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం AI171 ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 260 మంది పైగా మరణించారు. 241 మంది విమాన ప్రయాణీకులతో పాటు, హాస్టల్ భవంతిలోని 20 మంది విద్యార్థులు మరణించారని కథనాలొచ్చాయి. ప్రయాణీకుల్లో భారతీయులతో పాటు, లండన్, పోర్చ్ గీస్, కెనడా జాతీయులు ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత రవీనా టాండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుంచి భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేసారు. ప్రమాదాలు ప్రయాణాలను ఆపలేవు! అనే సందేశం కూడా తన పోస్ట్ లో ఇమిడి ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రవీనా టాండన్ హిందీ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు అనే చిత్రంలో రవీనా కథానాయికగా నటించింది. ఇప్పుడు రవీనా కుమార్తె రాషా తడానీ కథానాయికగా బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది. రాషా త్వరలోనే టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు అవకాశాలున్నాయి. బాహుబలి, సాహో సహా పలు చిత్రాలను తడానీ గ్రూప్ హిందీ బెల్ట్ లో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.