జాన్వీలా కాదు టాండ‌న్ న‌ట‌వార‌సురాలి క‌థే వేరు!

యువ‌త‌రం గుండెల్లో గుబులు పుట్టించే అందం రాషా సొంతం. అందుకే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.;

Update: 2025-11-17 20:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కుమార్తె జాన్వీక‌పూర్ టాలీవుడ్ లో ఘ‌న‌మైన ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న `దేవ‌ర‌` చిత్రంలో న‌టించింది. ఈ సినిమా పాన్ ఇండియాలో విజ‌యం అందుకుంది. త‌దుప‌రి దేవ‌ర‌2లోను జాన్వీ న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న `పెద్ది` లాంటి క్రేజీ చిత్రంలో న‌టిస్తోంది. ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాలు అందుకుంది జాన్వీ.

అయితే జాన్వీ త‌ర్వాత టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న మ‌రో క్రేజీ న‌ట‌వార‌సురాలు రాషా త‌డానీపైనే అంద‌రి దృష్టి ఉంది. ఈ భామ‌ నేప‌థ్యం కూడా చిన్న‌దేమీ కాదు. హిందీ చిత్ర‌సీమ‌లో పంపిణీ రంగంలో దిగ్గ‌జాలైన త‌డానీ కుటుంబం నుంచి ఆరంగేట్రం చేస్తున్న రాషాకు ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌లే ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ నుంచి ర‌మేష్ బాబు కుమారుడు జ‌య‌కృష్ణ ఘ‌ట్ట‌మ‌నేని హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమాలో క‌థానాయిక‌గా ఎంపికైంది.

యువ‌త‌రం గుండెల్లో గుబులు పుట్టించే అందం రాషా సొంతం. అందుకే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ర‌వీనా టాండ‌న్ న‌ట‌వార‌సురాలిగా రాషా ఇక్క‌డ బ‌ల‌మైన‌ ముద్ర వేయ‌గలుగుతుందా లేదా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. అయితే రాషా త‌డానీ త‌న‌ మొద‌టి సినిమా `ఆజాద్`లో `ఉయ్ అమ్మా..` పాట‌తో కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది. ఆజాద్ విజ‌యం సాధించ‌క‌పోయినా రాషా గుర్తుండిపోయింది. ఉయ్ అమ్మా పాట‌లో రాషా ఎన‌ర్జిటిక్ స్టెప్పుల‌కు యూత్ క‌ళ్ల‌ప్ప‌గించారు. అందుకే త‌న త‌ల్లి గారైన మేటి క‌థానాయిక ర‌వీనా టాండ‌న్ వార‌స‌త్వాన్ని నిల‌బెడుతుందా? అనే చర్చ సాగుతోంది. ఇక ర‌వీనా టాండ‌న్ తెలుగు లో నాలుగు సినిమాల్లో న‌టించినా `బంగారు బుల్లోడు` చిత్రంతో పెద్ద‌ విజ‌యం అందుకుంది. ఈ సినిమాలో ర‌వీనా న‌ట‌న‌, అంద‌చందాల‌కు యువ‌త‌రం ఫిదా అయిపోయారు. ఇప్పుడు న‌ట‌వార‌సురాలు రాషా త‌డానీ కూడా త‌న తెలుగు డెబ్యూతో అలాంటి ముద్ర వేస్తుందా? లేదా! అన్న‌ది వేచి చూడాలి.

ఆరంభ‌మే టాలీవుడ్ లో పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ‌ హీరోతో అవ‌కాశం ద‌క్కించుకుంది. ర‌మేష్ బాబు కుమారుడు జ‌య‌కృష్ణ తండ్రి లానే అంద‌గాడు. మ‌హేష్ త‌ర‌హాలో ఛామింగ్ హీరో. అయితే అతడు త‌న న‌ట‌న‌తో మెప్పించాల్సి ఉంటుంది. ఆరంగేట్ర న‌టి రాషాతో పోటీప‌డాల్సి ఉంటుంది. మ‌రోవైపు జాన్వీలా స్టార్ హీరోల‌తో కాకుండా రాషా త‌డానీ ఒక డెబ్యూ హీరో స‌ర‌స‌న న‌టించ‌డం త‌న‌కు ప్ల‌స్ అవుతుందేమో చూడాలి. జ‌య‌కృష్ణ‌- రాషా జంట `సైయారా` జంటలా ప్ర‌భావం చూప‌గ‌లిగితే అది పెద్ద ప్ల‌స్ అవుతుంది. కానీ అలాంటి మ్యాజిక్ చేసే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుందా? జ‌య‌కృష్ణ‌- రాషా త‌డానీ అంద‌మైన జంట అన‌డంలో సందేహం లేదు. ఈ చిత్రానికి ఆర్.ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. రెగ్యులర్ షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది.

Tags:    

Similar News