బిగ్ క్వశ్చన్! రణ్‌వీర్‌పై బ్యాన్ విధించారు కానీ ఆ 242 మంది సమస్య పట్టించుకోరా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నిషేధం విధించడం ఇప్పుడు భారత చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నిషేధం విధించడం ఇప్పుడు భారత చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, హసీన్ దిల్‌రుబా వంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ మహిళా ఎడిటర్ శ్వేతా వెంకట్ తీవ్రంగా మండిపడ్డారు. రణ్‌వీర్‌పై ఫెడరేషన్ తీసుకున్న చర్యలను ఆమె ఎద్దేవా చేస్తూ.. అసలు సంస్థను ఎందుకోసం స్థాపించారో ఆ ప్రాథమిక బాధ్యతలను ఎఫ్.డబ్ల్యూ.ఐ.సి.ఇ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రణ్‌వీర్ విషయంలో చూపించిన అత్యుత్సాహం- వేగం పరిశ్రమలోని వందలాది మంది కార్మికులు, సాంకేతిక నిపుణుల సమస్యల పరిష్కారంలో ఎందుకు కనిపించడం లేదని మహిళా ఎడిటర్ శ్వేతా నిలదీశారు.
శ్వేతా వెంకట్ ప్రధానంగా 2023లో 242 మంది సినిమా ఎడిటర్లు కలిసి ఉమ్మడిగా సమర్పించిన ఒక కీలక వినతిపత్రాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎడిటర్ల కోసం ప్రామాణిక వేతన పట్టికను ఏర్పాటు చేయడం.. ప్రొడక్షన్ హౌస్‌ల నుండి రావాల్సిన బకాయిలను సకాలంలో ఇప్పించడం... ఓటీటీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎడిటర్లకు సరైన క్రెడిట్స్ (పేర్లు) కల్పించడం.. పని ప్రదేశాల్లో మంచి వాతావరణాన్ని కల్పించడం వంటి ఐదు ప్రధాన డిమాండ్లతో ఆ పిటిషన్ దాఖలైంది. ఎడిటర్లు, నిర్మాతల మండలి మధ్య చర్చలు జరిపించి ఈ సమస్యలను పరిష్కరించాలని వారు ఎఫ్.డబ్ల్యూ.ఐ.సి.ఇని కోరారు. అప్పట్లో లేని ఈ ఎఫిషియెన్సీ (వేగం) ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? మేం ఆ వినతిపత్రం ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు దానిపై ఎలాంటి చర్యలు లేవు! అంటూ ఆమె ధ్వజమెత్తారు.
ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా సామాన్య నెటిజన్ల నుండి బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డాన్ 3 సినిమా ఎలాగూ ఆడదనే భయంతోనే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ రణ్‌వీర్ సింగ్ నుండి రూ. 45 కోట్ల భారీ నష్టపరిహారం ఆశిస్తున్నాడని.... ఇదంతా అతడి ఇల్లు గడవడం కోసమేనని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. పరిశ్రమలోని కొందరు అగ్ర హీరోలు, వారి అనుకూల వర్గాలు పానిక్ అయి రణ్‌వీర్‌ను ఇండస్ట్రీ నుండి వెలివేయడానికి ప్రయత్నిస్తున్నారని... కానీ భారతీయ ప్రేక్షకులు భవిష్యత్ లో వారి సినిమాలను సూపర్ ఫ్లాప్ చేయడం ద్వారా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు. బాలీవుడ్‌లో నెపోటిజం గ్యాంగ్ ఎప్పుడూ తమ సొంత పిల్లల ప్రయోజనాలను కాపాడుకోవడానికే ఇలాంటి కుయుక్తులు పన్నుతుందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు ఎఫ్.డబ్ల్యూ.ఐ.సి.ఇ సంస్థను తీరును తప్పుపడుతూ.. ఇది కేవలం ఇండస్ట్రీలోని `పెద్ద సాహెబుల` చేతిలో కీలుబొమ్మగా మారిందని... బాలీవుడ్‌కు పట్టిన దావూద్ సంస్కృతిని కడిగేయడానికి ఇదే సరైన సమయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫెడరేషన్‌లో చక్రం తిప్పుతున్న అశోక్ పండిట్ వంటి వారు తమ స్వప్రయోజనాలు, కమీషన్లు ఉంటే తప్ప సాధారణ టెక్నీషియన్ల సమస్యలను పట్టించుకోరని విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే జోక్యం చేసుకుని ఫర్హాన్ అక్తర్ వంటి వారితో కలిసి బాలీవుడ్‌లో మోనోపలీ నడుపుతూ ఇలాంటి `గూండాయిజం`కు పాల్పడుతున్న FWICE సంస్థపై విచారణ జరిపించాలని... అవసరమైతే ఈ పాత సంస్థను రద్దు చేసి రకరకాల శాఖలకు కూడా ప్రాధాన్యత ఉండేలా ఈ సంస్థను రీడిజైన్ చేయాలని కోరారు. రణ్‌వీర్ సింగ్‌పై విధించిన ఈ నిషేధం బాలీవుడ్‌లోని అంతర్గత రాజకీయాలను, పెద్దల పక్షపాత వైఖరిని మరోసారి బట్టబయలు చేసిందనే వాదన బలపడుతోంది.