ఫెడ‌రేష‌న్‌పై కేసు.. 'డాన్ 3' వివాదంలో ర‌ణ్‌వీర్ త‌గ్గేదేలే!

అయితే కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకుంటున్న ఈ తరుణంలో అత‌డు ఊహించని విధంగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకోవడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-06-03 06:43 GMT

'దురంధర్' వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ గ్రాఫ్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తన కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యమైన, భారీ బడ్జెట్ కథాంశాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూకుడుగా దూసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకుంటున్న ఈ తరుణంలో అత‌డు ఊహించని విధంగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకోవడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కాస్తా ర‌ణ‌వీరుడి కెరీర్ ప్లాన్స్‌కు ఒక బిగ్ బ్రేక్ వేసే పరిస్థితిని తెచ్చిపెట్టింది.

ప్రముఖ దర్శక‌నిర్మాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించాల్సిన మోస్ట్ అవేటెడ్ మూవీ `డాన్ 3` నుంచి రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ.. ఫెడరేషన్‌లో రణ్‌వీర్ సింగ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన `ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్` (FWICE), రణ్‌వీర్‌పై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ (సహకరించకూడదనే ఆదేశం) జారీ చేస్తూ ఒక రకమైన నిషేధాన్ని విధించింది.

అయితే రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయాన్ని సినీ ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు, ర‌ణ్ వీర్ సహచరులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక నటుడిపై ఇలాంటి నిషేధాలు విధించే హక్కు, అధికారం ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు లేదంటూ రణ్‌వీర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదం ఇంతటితో ఆగకుండా మరింత ముదిరింది. ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నిర్మాత రణ్‌వీర్ సింగ్ తరఫున ఏకంగా కోర్టులో కేసు వేయడం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఈ వివాదంలో రణ్‌వీర్ సింగ్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై నిషేధం విధించిన వారం రోజులకే ఆయన FWICE సంస్థకు ఘాటుగా లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్వయంగా ధృవీకరించారు. రణ్‌వీర్ పంపిన లీగల్ నోటీసుల్లోని పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాక‌పోయినా కానీ.. ఫెడరేషన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలనే రణ్‌వీర్ గట్టిగా నిశ్చయించుకున్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

ఈ లీగల్ నోటీసుల వ్యవహారంతో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ -రణ్‌వీర్ సింగ్ మధ్య రేగిన `డాన్ 3` పుండు మ‌రింత పెద్ద‌ద‌వుతోంది. ఈ వివాదం ముంబై ట్రేడ్ వర్గాల్లో మరింత ఉత్కంఠకు తెర తీస్తోంది. ఈ పరిణామాలపైనా.. అలాగే రణ్‌వీర్ పంపిన లీగల్ నోటీసులపైనా స్పందించేందుకు.. తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు FWICE ప్రతినిధులు ఈరోజు ముంబైలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మీడియా సమావేశం తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని యావత్ బాలీవుడ్ పరిశ్రమ స‌హా అన్ని సినీప‌రిశ్ర‌మ‌లు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Tags:    

Similar News