ఆలస్యంతో మల్టీస్టారర్‌పై రూ.100 కోట్ల భారం..!
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో లవ్ & వార్ ఒకటి. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.;
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో లవ్ & వార్ ఒకటి. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ భారీ బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది చివర్లో ప్రారంభం అయింది. ఆ సమయంలోనే సినిమా ను 2025 చివరి వరకు విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సినిమాను 2026 ఈద్ కి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మేకింగ్ విషయంలో ఒక కొలిక్కి రాని కారణంగా సినిమాను వాయిదా వేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు సినిమాను 2026 మే లో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమా మరో మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
లవ్ & వార్ సినిమా విడుదల వాయిదా...
రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇద్దరూ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అలాంటి సినిమాను ఆశామాషీగా తీయకూడదు అనే ఉద్దేశంతో దర్శకుడు భన్సాలీ కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే సినిమా వాయిదాల పర్వం కొనసాగుతోంది అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు, మీడియా వర్గాల వారు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మొదట ఈ సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్‌లో పూర్తి చేయాలి అనుకున్నారు. హీరోల పారితోషికం కాకుండా ఈ సినిమాను ఆ బడ్జెట్‌లో పూర్తి చేసి ఉంటే ఖచ్చితంగా భారీగా లాభాలు దక్కి ఉండేవి. కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. పైగా సినిమా దాదాపు ఏడాది ఆలస్యం కాబోతుంది. దాంతో బడ్జెట్ కనీసం రూ.100 కోట్లకు పైగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఇప్పటికే భారీగా బిజినెస్ చేసింది.
రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా...
సినిమా మేకింగ్ ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ భారీగా పెరగడంతో భారం పెరుగుతుంది. పైగా రణబీర్ కపూర్ నటిస్తున్న మరో సినిమా రామాయణం సైతం వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లవ్ & వార్ మరియు రామాయణం సినిమాలు కాస్త అటు ఇటుగా కొన్ని వారాల తేడాతో వస్తే కచ్చితంగా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుంది అనేది బాక్సాఫీస్ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా లవ్ & వార్ సినిమాపై అధిక భారం పడుతుంది అనేది చాలా మంది చెబుతున్న మాట. అదే నిజం అయితే పెరిగిన బడ్జెట్, కలెక్షన్స్ తగ్గడం వల్ల నిర్మాతలకు నష్టం చేకూరే అవకాశం ఉందని అంటున్నారు. లక్ ఏంటంటే ఇప్పటికే ఈ సినిమా ను ప్రముఖ ఓటీటీ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అంతే కాకుండా ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ సైతం భారీ మొత్తంలో వచ్చాయి. దాంతో సినిమా బడ్జెట్ రికవరీ అనుకున్నారు. కానీ ఇప్పుడు పెరిగిన బడ్జెట్ నిర్మాతల చేతుల నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఆలియా భట్ హీరోయిన్‌గా...
రణబీర్ కపూర్, ఆలియా భట్ కాంబోకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రారంభం అయిన సమయంలోనే రూ.215 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేయడం జరిగింది. పైగా ఈ సినిమాలో విక్కీ కౌశల్ సైతం ఉండటం, భారీ మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కానీ సినిమా ఆలస్యం అవుతున్న కొద్ది ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుంది అనేది కొందరి అభిప్రాయం. బడ్జెట్ పెరగడం, పోటీగా మరో సినిమా ఉండటం, ప్రేక్షకుల్లో బజ్ తగ్గడం వల్ల భారీ మల్టీస్టారర్ కి విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సినిమాకు సూపర్ హిట్ టాక్ పడితే ఈ కాంబో కచ్చితంగా రూ.1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ను నమోదు చేసినా ఆశ్చర్యం లేదు అనేది కొందరి మాట. మొత్తానికి ఆలస్యం అవుతున్న కారణంగా భారీ భారం పెరుగుతుంది. మరి ఆ భారం ను సినిమా ఎంత వరకు మోయగలదు అనేది కాలమే నిర్ణయించాలి.