పాతికేళ్ల తర్వాత... తాత, తండ్రి జ్ఞాపకార్ధం రీ స్టార్ట్‌

1948లో దివంగత లెజెండ్‌ రాజ్‌ కపూర్‌ ప్రారంభించిన ఆ స్టూడియో 2017లో అగ్ని ప్రమాదం జరగడంతో కనుమరుగు అయింది.;

Update: 2025-10-30 18:30 GMT

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొన్ని సినిమా స్టూడియోలు మారుతూ ఉంటే, కొన్ని స్టూడియోలను మార్చే అవకాశం ఉన్నా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఒడిదొడుకుల కారణంగా స్టూడియోలను మూసేస్తున్న వారు కొందరు ఉన్నారు. ముంబైలో ఇండియన్‌ సినిమాకు ప్రాణం పోసిన పలు స్టూడియోలు మూత పడ్డాయి, కొన్ని కనుమరుగు అయ్యాయి, కొన్ని స్టూడియోలు పాత రేకుల షెడ్డుల మాదిరిగా గత జ్ఞాపకాలకు గుర్తులుగా నిలిచి ఉన్నాయి. చాలా స్టూడియోలు ఇప్పటికే నేల మట్టం అయ్యి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లుగా మారి పోయాయి. ఆ కోవలోకే ముంబైలోని ఆర్‌కే స్టూడియో వస్తుంది. 1948లో దివంగత లెజెండ్‌ రాజ్‌ కపూర్‌ ప్రారంభించిన ఆ స్టూడియో 2017లో అగ్ని ప్రమాదం జరగడంతో కనుమరుగు అయింది. అగ్నిప్రమాద సమయంలో సెట్‌లు, పలు జ్ఞాపకాలు మంటల్లో కలవడంతో స్టూడియోను గోద్రేజ్ కంపెనీకి విక్రయించడం జరిగింది.

రణబీర్‌ కపూర్‌ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో...

ఆర్‌కే ఫిల్మ్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు సైతం నిర్మాణం జరిగాయి. అయితే కొన్ని కారణాల వల్ల గత పాతికేళ్ల కాలంగా సినిమాల నిర్మాణంను ఆపేశారు. అయితే రాజ్‌ కపూర్‌ తనయుడు అయిన రిషి కపూర్‌ చనిపోయే ముందు వరకు ఆర్‌కే ఫిల్మ్ స్టూడియోను పునః ప్రారంభించాలని, ప్రొడక్షన్ హౌస్‌ను నిర్వహించాలని అనుకున్నాడు. కానీ ఆయన కల నెరవేరకుండానే కన్ను మూశాడు. ఇప్పుడు తన తండ్రి కల, తన తాత వారసత్వంను నిలబెట్టేందుకు ఆర్‌కే ఫిల్మ్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లో సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆర్‌కే ఫిల్మ్‌ స్టూడియోస్ బ్యానర్‌లో రణబీర్‌ కపూర్‌ స్వయంగా సినిమాను నిర్మించేందుకు గాను సిద్ధం అయ్యాడు.

దీపికా పదుకునే హీరోయిన్‌గా...

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే ను ఎంపిక చేయడం జరిగిందట. ఇప్పటికే ఆర్‌కే ఫిల్మ్స్‌ బ్యానర్ నుంచి ఆమెకు మొదటి అడ్వాన్స్ చెక్‌ అందింది అని కూడా బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఆర్‌కే స్టూడియోస్ బ్యానర్‌ నుంచి సినిమా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అయాన్‌ ముఖర్జీ సినిమాను రూపొందిస్తున్నాడు. ఆకట్టుకునే కథ, కథనంతో అయాన్ ముఖర్జీ ఈ సినిమాను రూపొందించేందుకు గాను స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులను సైతం ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. అధికారికంగా మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ రాజ్‌ కపూర్‌

బాలీవుడ్‌ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియన్‌ సినిమాకు గర్వకారణం అయిన రాజ్‌ కపూర్‌ స్థాపించిన స్టూడియోను, ప్రొడక్షన్‌ కంపెనీని ఆయన మనవడు తిరిగి ప్రారంభించడం అనేది గొప్ప భావోద్వేగ సందర్భం అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు కామెంట్‌ చేస్తున్నారు. ఆర్‌కే స్టూడియో నిర్మాణం విషయంలో రణబీర్‌ కపూర్‌ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ప్రొడక్షన్ హౌస్‌ను తిరిగి ప్రారంభించి వరుసగా సినిమాలను నిర్మించాలనే ఉద్దేశం ఉంది. తద్వారా తన తండ్రి రిషి కపూర్‌ తో పాటు, తన తాత లెగస్సీని కొనసాగించిన వాడిని అవుతాను అని రణబీర్‌ కపూర్‌ నమ్ముతున్నాడు. ఇది ఆయనకు ఒక వ్యాపారం కాకుండా, బాధ్యత అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాధ్యతను రణబీర్‌ కపూర్‌ ఏ మేరకు పూర్తి చేస్తాడు, ముందు ముందు తాత, తండ్రి వారసత్వంను ఎలా కొనసాగిస్తాడు అనేది చూడాలి.

Tags:    

Similar News