'రామాయణ' గ్రాఫిక్స్ క్రిటిక్స్‌పై రణబీర్ ఏసేసాడు!
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం `రామాయణ`టీజర్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ' టీజర్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విజువల్స్ - వీఎఫ్‌ఎక్స్ (VFX) నాణ్యతపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు విజువల్ స్కేల్‌ను మెచ్చుకోగా.. మరికొందరు గ్రాఫిక్స్ నాణ్యతను తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదంపై పాపులర్ హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో కథానాయకుడు రణబీర్ కపూర్ స్పందిస్తూ విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
రణబీర్ మాట్లాడుతూ... ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడంతో నెటిజన్లలో గ్రాఫిక్స్ పై అవగాహనతో పాటు విమర్శలు కూడా ఎక్కువయ్యాయని అన్నారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రజలు మారారు. బాగా అప్ డేట్ అయ్యారు. వారంతా సీజీ క్రిటిక్స్ గా మారిపోయారు. ఏదైనా ట్రైలర్ రాగానే ఇది సరిగ్గా లేదు... వర్క్ ఇంకా పూర్తి కాలేదు! అంటూ విమర్శించడం పరిపాటిగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ మేకింగ్‌ను కొందరు ఏఐ ద్వారా సులభంగా చేసేసే పనిగా భావిస్తున్నారు. అది నాకు నవ్వు తెప్పిస్తుంది. కానీ ఒక ఫ్రేమ్ వెనుక వేలాది మంది విజువల్ ఆర్టిస్టులు సంవత్సరాల తరబడి పడే కష్టం ఉంటుంది. ఆకాశం రంగును పర్ఫెక్ట్‌గా తీసుకురావడానికి కూడా దర్శకుడు నితీష్ సర్, నిర్మాత నమిత్ మల్హోత్రా గంటల తరబడి మీటింగ్స్ పెట్టడం నేను స్వయంగా చూశాను! అని రణబీర్ వివరించారు.
ఈ విమర్శలపై చిత్ర నిర్మాత, ప్రఖ్యాత వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు నమిత్ మల్హోత్రా కూడా స్పందించారు. ఈ విమర్శలన్నీ ప్రేక్షకులు ట్రైలర్‌ను చిన్న మొబైల్ ఫోన్ స్క్రీన్లలో చూడటం వల్లే వస్తున్నాయని.. ఇది కేవలం అనవసరమైన ఆందోళన మాత్రమేనని కొట్టిపారేశారు. ఈ చిత్రాన్ని ప్రొఫెషనల్ ఐమ్యాక్స్ 3డి స్క్రీన్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశామని... ఫోన్లలో చూసి విజువల్స్, సౌండ్ క్వాలిటీపై నిర్ణయానికి రావడం సరికాదని స్పష్టం చేశారు. క్రిస్టోఫర్ నోలన్ `ది ఒడిస్సీ` లాంటి సినిమాలను కూడా పెద్ద స్క్రీన్లపై చూస్తేనే ఆ అనుభూతి దక్కుతుందని ఆయన ఉదాహరణగా చెప్పారు.
సుమారు రూ. 4,000 కోట్ల బ్రహ్మాండమైన బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ 'రామాయణ' చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో రణబీర్ కపూర్ (శ్రీరాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణాసురుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అరుణ్ గోవిల్, వివేక్ ఒబెరాయ్, రాకుల్ ప్రీత్ సింగ్ , లారా దత్తా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన మొదటి భాగం 2026 దివాళీ కానుకగా థియేటర్లలోకి రానుండగా.. రెండవ భాగం 2027 దివాళీకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.