రామాయణం స్టార్ 'సాత్వికాహారం' PR స్టంట్?
ఇటీవల నితీష్ తివారీ `రామాయణం` కోసం రణబీర్ తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడని అతడి పీఆర్ బృందం ప్రకటించింది.;
పాత్రలోకి పరకాయం చేసేందుకు సినిమా తారలు చాలా కృషి చేస్తున్నారు. ఎంపిక చేసుకున్న పాత్ర తీరుతెన్నులు, స్వభావ రీత్యా తమ శరీరభాషను మార్చుకునేందుకు నిరంతరం జిమ్, యోగా సెషన్స్ పేరుతో కఠిన నియమాలను పాటిస్తున్నారు. ఇటీవల నితీష్ తివారీ `రామాయణం` కోసం రణబీర్ తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడని అతడి పీఆర్ బృందం ప్రకటించింది.
మద్యం, మాంసాహారం ముట్టడం లేదని, పొగ తాగడం లేదని, చాలా కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నాడని పీఆర్‌లు వెల్లడించారు. శ్రీరాముడిలా ఆహ్లాదకరంగా కనిపించేందుకు జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసినట్టు వారు వెల్లడించారు. యోగ, ధ్యానం వంటివి రణబీర్ ప్రాక్టీస్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
రామాయణం కోసం రణబీర్ కపూర్ జీవనశైలిలో చాలా మార్పులు చేసాడని వచ్చిన వార్తలను సవాలు చేస్తూ ఒక కొత్త వీడియో రావడంతో వివాదం మొదలైంది. తాజాగా విడుదలైన వీడియో నెట్ లో వేగంగా వైరల్ అవుతోంది. రాజ్ కపూర్ 100వ జయంతిని పురస్కరించుకుని `డైనింగ్ విత్ ది కపూర్స్`లో భాగమైన తాజా క్లిప్‌లో కపూర్ కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. అర్మాన్ జైన్ డిన్నర్ టేబుల్ వద్ద ఉండి, కపూర్ వంశానికి ఫిష్ కర్రీ రైస్ -జంగ్లీ మటన్ వడ్డిస్తున్నాడు. నీతు కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రిమా జైన్ సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రణబీర్ భోజనం చేస్తూ కనిపించాడు.
అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త వీడియో..పూర్తిగా తప్పు దారి పట్టించే పీఆర్ స్టింట్ అని కొట్టి పారేస్తున్నారు.
ఈ వీడియో వేగంగా నెట్ లో దూసుకుపోతోంది. చాలా మంది నెటిజనులు ఇదంతా ప్రచారం కోసం అల్లిన కట్టు కథ అంటూ కొట్టి పారేస్తున్నారు.
''రాముడి పాత్ర పోషించినందుకు గౌరవంగా రణబీర్ మాంసాహారాన్ని వదులుకున్నట్లు పీఆర్ బృందం పేర్కొంది. కానీ అతడు తన కుటుంబంతో కలిసి చేపల కూర, మటన్ , పాయాను ఆస్వాధిస్తున్నాడు. రణబీర్ కపూర్ బాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన పిఆర్‌ను కలిగి ఉన్నాడు.. అని ఒక నెటిజన్ తీవ్రంగా దుయ్యబట్టాడు. అసలు అలాంటి వాదనలను సృష్టించడం వెనుక ఉన్న వ్యూహాలు ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నాడు. అసలు రణబీర్, ఆలియా ఇద్దరి పీఆర్ లను ముందుగా తొలగించాలి. వారు తప్పుడు కథనాలు ప్రచారం చేయకూడదు. పీఆర్ లు ఇంత మూర్ఖత్వాన్ని పోస్ట్ చేసే ముందు వారి క్లయింట్ల గత వీడియోల గురించి కొంచెం కూడా పరిశోధన చేయరు… పాత్ర కోసం మాంసాహారం, పానీయాలను వదిలివేస్తున్నట్లు వాదనలు చేయాల్సిన అవసరం ఏమిటి? ఎవరు అడిగారు? అని కూడా ప్రశ్నించారు మరో నెటిజన్.
వివాదాలు ఎన్ని ఉన్నా రామాయణంపై ప్రజల్లో ఆసక్తి ఉంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపిస్తారు, సాయి పల్లవి సీతగా నటిస్తుంది. యష్ రావణుడి పాత్రను పోషిస్తుండగా, సన్నీడియోల్ హనుమంతుడుగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా మండోదరి, శూర్పణఖ పాత్రల్లో నటిస్తున్నారు. రామాయణం మొదటి భాగం ఇప్పటికే ఎడిటింగ్ పూర్తయిందని కథనాలొస్తున్నాయి. పార్ట్ 2 చిత్రీకరణను వేగంగా పూర్తి చేయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.