రామాయ‌ణంలో ర‌ణ‌బీర్ ద్విపాత్రాభిన‌యం? ఆ రెండోది ఏంట‌బ్బా!

నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `రామాయణం` చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.;

Update: 2026-04-04 07:39 GMT

నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `రామాయణం` చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పోషిస్తున్న పాత్రల గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇతిహాస గాథలో రణబీర్ కేవలం శ్రీరాముడి పాత్రకే పరిమితం కాకుండా.. ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు స్వయంగా ధృవీకరించారు. ఇది అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసింది.

ఈ చిత్రంలో రణబీర్ కపూర్ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి పాత్రతో పాటు, అత్యంత శక్తివంతమైన పరశురాముడి పాత్రను కూడా పోషిస్తున్నారు. ఒకే చిత్రంలో విష్ణుమూర్తికి చెందిన ఇద్దరు అవతార పురుషుల పాత్రలను పోషించే అవకాశం రావడం నటుడిగా తనకు దక్కిన అద్భుతమైన గౌరవమని రణబీర్ హర్షం వ్యక్తం చేశారు. శాంతానికి మారుపేరైన రాముడు, ఆగ్రహానికి నిలువెత్తు రూపమైన పరశురాముడు.. ఇలా పూర్తి విరుద్ధ స్వభావాలు ఉన్న పాత్రలను ఒకే నటుడు చేయడం విశేషం.

నిజానికి పురాణాల్లో పరశురాముడి పాత్రకు చాలా ప్రత్యేకమైన స్థానం, వెయిట్ ఉంది. పరశురాముడి ఉగ్ర రూపాన్ని ఆయన పవర్‌ఫుల్ వ్యక్తిత్వాన్ని వెండితెరపై రణబీర్ ఎలా ఆవిష్కరిస్తారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీరాముడి పాత్ర కంటే పరశురాముడి గెటప్, మేకోవర్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రణబీర్ లోని కొత్త నటన కోణాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో అగ్ర నటీనటులు కనిపిస్తున్నారు. రాక్షస రాజు రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తుండగా, సీతమ్మ తల్లిగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణం మధ్య రణబీర్ కపూర్ చేస్తున్న ఈ ద్విపాత్రాభినయం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రం 2026 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్ తొలిసారిగా ఇలాంటి ఒక చారిత్రక నేపథ్యంలో అందులోనూ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాలంటే నితీష్ తివారీ సాంకేతిక‌త‌ను స‌రైన పంథాలో స‌ద్వినియోగం చేయాల్సి ఉంటుందని అంచ‌నాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చిన సంద‌ర్భంగా అత‌డు మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంది.

Tags:    

Similar News