కాంత వలన ఎవరైనా హర్ట్ అయ్యే అవకాశం ఉందా?.. క్లారిటీ ఇచ్చిన రానా
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కలిసి నిర్మిస్తూ, నటిస్తున్న పీరియాడిక్ డ్రామా 'కాంత'.;
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కలిసి నిర్మిస్తూ, నటిస్తున్న పీరియాడిక్ డ్రామా 'కాంత'. పాతతరం సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో, ఇది ఎవరినైనా ఉద్దేశించి తీస్తున్నారా, లేదా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను చూపిస్తున్నారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. లేటెస్ట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ప్రశ్నలకు నిర్మాత రానా దగ్గుబాటి క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన 'కాంత' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనంతరం చిత్రబృందం మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్.. 'కాంత' సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరి ఈగోల మధ్య జరిగే కథ అని, ఇండస్ట్రీలోని డార్క్ సైడ్‌ను కూడా టచ్ చేస్తున్నారా? దీనివల్ల ఎవరైనా హర్ట్ అయ్యే అవకాశం ఉందా? అని రానాను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రానా చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. "ఈ సినిమా చూసి ఎవరూ హర్ట్ అవ్వరు. ఇది కచ్చితంగా చెప్పగలను" అని ఆయన హామీ ఇచ్చారు. "మీరు ఇండస్ట్రీలోని డార్క్ సైడ్ అన్నారు.. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలోని డార్క్ సైడ్ గురించి కాదు, మన మనుషుల్లో ఉండే డార్క్ సైడ్ గురించి" అని రానా అసలు నిజాన్ని బయటపెట్టారు.
సినిమా కాన్సెప్ట్ గురించి వివరిస్తూ.. "ప్రతి మనిషిలో ఒక డార్క్ సైడ్, ఒక డార్క్ ఈగో ఉంటుంది. ఈ సినిమా ఆ డార్క్ ఈగో బేస్ చేసుకునే నడుస్తుంది" అని రానా తెలిపారు. ఈ కథలో సినిమా ఇండస్ట్రీ నేపథ్యం కేవలం ఒక బ్యాక్‌డ్రాప్ మాత్రమేనని, అసలు కథ గురు శిష్యుల మధ్య జరిగే సంఘర్షణ అని స్పష్టం చేశారు.
అలాగే, ఈ సినిమా ఏమైనా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిందా? అని అడగ్గా.. "అలా ఏ ఒక్క ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీసింది కాదు. కానీ, మేం చాలా ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నాం. ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదు" అని రానా తేల్చి చెప్పారు. మొత్తంమీద 'కాంత' అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్ అయిన 'ఈగో' చుట్టూ తిరుగుతుందని, దానికి వింటేజ్ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను జోడించారని రానా మాటలతో అర్థమవుతోంది. ఆయన ఇచ్చిన క్లారిటీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.