4000 కోట్లతో సినిమా.. ఎందుకింత లేట్?
భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ సినిమా తెరకెక్కుతోంది.;
భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి కథనాలు వచ్చేలా గట్టిగానే ప్లాన్ చేశారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఏదైనా గ్లింప్స్ వస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
నిజానికి శ్రీరామనవమి రోజున రాముడికి సంబంధించిన అప్‌డేట్ వస్తే దానికి వచ్చే మైలేజ్ వేరుగా ఉంటుంది. కానీ మేకర్స్ మాత్రం ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రోజున ‘రామ’ గ్లింప్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరామనవమి పండుగ రోజే అసలు సిసలైన ప్రమోషన్ మొదలుపెట్టాల్సింది పోయి, గ్యాప్ తీసుకోవడం ఏంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మార్కెటింగ్ పరంగా ఇది సరైన ప్లాన్ కాదని ట్రేడ్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
హనుమాన్ జయంతి నాడు గ్లింప్స్ విడుదల చేయడం అనేది కొంత రిస్క్ తో కూడుకున్న విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీరామనవమికి ఉన్నంత క్రేజ్ ఆ రోజున సినిమా అప్‌డేట్‌కు లభిస్తుందా అన్నది సందేహమే. ఒక పక్కా ప్లానింగ్ తో వెళ్లాల్సిన ఇంతటి భారీ బడ్జెట్ సినిమాకు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎంచుకున్న ఈ కొత్త రూట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తుండటం ప్రాజెక్ట్ కు వెయిట్ పెంచింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ గెలుచుకున్న సంస్థలు పనిచేస్తున్నాయి. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం 2026, 2027 దీపావళి ఫెస్టివల్స్ లో విడుదల కానుంది. టెక్నికల్ గా సినిమా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, ఆడియన్స్ కు చేరువ కావడంలో మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అంతే ముఖ్యం. టీమ్ ఇప్పుడు హనుమాన్ జయంతి రోజున రాబోయే గ్లింప్స్ ద్వారా ఈ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాలని చూస్తోంది.
ఏప్రిల్ 2న రాబోయే ఆ గ్లింప్స్ లో రణబీర్ కపూర్ రాముడి లుక్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ ఆ విజువల్స్ గనుక ప్రేక్షకులను మెప్పిస్తే ఇప్పుడు జరుగుతున్న నెగిటివ్ చర్చ మొత్తం ఆగిపోయే ఛాన్స్ ఉంది. దైవత్వంతో కూడిన ఒక గొప్ప కథను ఇంత భారీ ఖర్చుతో తీస్తున్నప్పుడు చిన్న పొరపాట్లు కూడా పెద్దగా కనిపిస్తాయి. హనుమాన్ జయంతి నాడు రాముడి విశ్వరూపాన్ని మేకర్స్ ఎలా చూపిస్తారో వేచి చూడాల్సిందే.