గల్లీ గల్లీలో మన రామాలయం ఉంది : ట్రైలర్ లాంచ్‌లో యశ్ భావోద్వేగం
భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణంగా మారనున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం` ట్రైలర్ లాంచ్ వేడుక ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది.
భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణంగా మారనున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం` ట్రైలర్ లాంచ్ వేడుక ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కన్నడ రాకింగ్ స్టార్, ఈ చిత్రంలో లంకాధిపతి రావణాసురుడిగా ప్రతినాయక పాత్రను పోషిస్తున్న యశ్ పాల్గొని మాట్లాడారు. మనదేశపు గొప్ప ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడం వెనుక ఉన్న ఆలోచనను.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు తనకున్న ఆనందాన్ని వేదికపై పంచుకున్నారు.
నిర్మాత నమిత్ మల్హోత్రా తనకు ఈ అద్భుతమైన ప్రతిష్టాత్మక పాత్రను పోషించే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరిస్తూ యశ్.. ``ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. భారతీయులందరి కల. మన సంస్కృతికి ప్రతీకైన ఈ కథను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ఒకే ఒక దృక్పథంతో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ప్రభు శ్రీరాముడి పవిత్రమైన కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూలమూలల ప్రేక్షకులకు చేరవేయడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం`` అని సగర్వంగా ప్రకటించారు. ఆయా పాత్రలలోని సూక్ష్మ నైపుణ్యాలను తనకు స్పష్టంగా వివరించి, మార్గదర్శకత్వం వహించిన దర్శక ధీరుడు నితేష్ తివారీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలోని తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర స్థలం ఏదైనా గల్లీ గల్లీలో రామాలయాలు ఉన్నాయని యష్ ఈ సందర్భంగా గుర్తు చేసారు. తాను చికుబుకు చికుబుకు రైలే పాటకు డ్యాన్సులు చేసానని, రామాయణం కి పని చేసిన రెహమాన్ కి అభిమానిని అని కూడా తెలిపారు.
అలాగే ఈ సినిమాలో పనిచేసిన సహ నటీనటులపై యశ్ ప్రశంసల జల్లు కురిపించారు. రాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్‌ను ఉద్దేశించి మాట్లాడూ.. రణ్‌బీర్.. నువ్వు అద్భుతంగా నటించావు. ఈ పాత్రలో నువ్వు ఒదిగిపోయిన తీరు, వెండితెరపై సృష్టించిన మ్యాజిక్ ఏంటో త్వరలోనే యావత్ భారతదేశం చూసి మైమరిచిపోతుంది అని అన్నారు. ఇక సీతగా నటిస్తున్న సాయి పల్లవి నటనను కొనియాడుతూ, ఆమె కళ్ల ద్వారానే భావోద్వేగాలు అద్భుతంగా పండుతాయని తెలిపారు.
వీరితో పాటు ఈ చిత్రంలో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, ఇతర కీలక పాత్రల్లో శోభన, వివేక్ ఒబెరాయ్ తదితరులు కనిపిస్తారని చెప్పారు. నటుడు రవి దూబే ఈ సినిమాలో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజీలా నిలుస్తారని వెల్లడిస్తూ.. ప్రేక్షకులకు థియేటర్లలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఘట్టాలు వేచి ఉన్నాయని యశ్ హామీ ఇచ్చారు. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ `రామాయణం` చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఈ వేడుకతో స్పష్టమైంది.