ప్రతి మహిళను మన ఇంటి ఆడపడుచులా గౌరవించాలి: సాయి తేజ్
సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.
సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. అభిమానుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు, ప్రేమకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేదికపై ఆయన అభిమానులను ఉద్దేశించి రోడ్డు భద్రత, మహిళల గౌరవం వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరికీ ముఖ్యమని గుర్తు చేస్తూ ``హెల్మెట్ పెట్టుకోవాలి`` అని అందరితో నినదింపజేశారు. అలాగే మహిళలను, హీరోయిన్లను కించపరిచేలా మాట్లాడకూడదని.. ఇంటి ఆడపడుచులను ఎలా గౌరవిస్తామో సమాజంలో మహిళలను కూడా అంతే మర్యాదగా చూడాలని.. అప్పుడే మన గౌరవం పెరుగుతుందని పిలుపునిచ్చారు.
అభిమానుల భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూ.. సినిమాల్లో హిట్లు, ఫ్లాపులు సహజమని, కానీ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని చెప్పారు. దయచేసి కెరీర్‌పై దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. మీ ప్రేమాభిమానాలతో సినిమాలు హిట్ చేసుకుంటామని.. కానీ అభిమానులు జీవితంలో సక్సెస్ సాధిస్తేనే అసలైన గర్వమని పేర్కొన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గా తేజ్ తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. తాత్కాలికంగా SDT19 అని పేరు పెట్టిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. `బాహుబలి` చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొంది, `సేవ్ ది టైగర్స్` వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా మెప్పించిన తేజ కకుమను ఈ సినిమా ద్వారా ఫీచర్ ఫిలిం డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
మంచి భావోద్వేగాలు, కుటుంబ బంధాలతో కూడిన పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సంగీత దర్శకుడు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.