రామాయ‌ణంలో రాముడు రావ‌ణాసురుడిపై దండెత్త‌క‌పోతే సినిమా చూస్తారా?

రావణుడి పాత్ర చిత్రణలో దర్శకుడు నితీష్ తివారీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా యష్ ధరించే దుస్తులు, అలంకరణలో బంగారాన్ని విరివిగా ఉపయోగించనున్నట్లు సమాచారం.;

Update: 2026-04-15 03:51 GMT

దంగ‌ల్ ఫేం, ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామాయణ` చిత్రంపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో నడుస్తోంది. రామాయణ గాథను రెండు భాగాలుగా వెండితెరపై ఆవిష్కరిస్తుండటంతో మొదటి భాగంలో కథానాయకుడు శ్రీరాముడు (రణబీర్ కపూర్)... ప్రతి నాయకుడు రావణాసురుడు (యష్) మధ్య నేరుగా తలపడే సన్నివేశాలు అంటే `ఫేసాఫ్` ఉండదని తెలుస్తోంది. పురాణేతిహాసాల ప్రకారం కూడా రాముడు లంకపై దండెత్తే వరకు రావణుడితో ప్రత్యక్ష యుద్ధం జరగదు కాబట్టి.. చిత్ర బృందం కూడా అదే నియ‌మాన్ని పాటించి యుద్ధ స‌న్నివేశాల కోసం ఆత్ర‌ప‌డ‌లేద‌ట‌.

ఈ చిత్రంలో రావణుడి పాత్రను కన్నడ రాకింగ్ స్టార్ యష్ పోషిస్తున్నారు. ఆయ‌న స‌హ‌నిర్మాత కూడా. మొదటి భాగంలో రాముడు, రావణుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం లేదని నిర్మాత హోదాలో యష్ స్వయంగా ధృవీకరించారు. రావణుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా లంక నేపథ్యం చుట్టూనే సాగుతాయని సమాచారం. దీనివల్ల మొదటి భాగం ప్రధానంగా రాముడి బాల్యం- వనవాసం- సీతాపహరణం వంటి కీలక ఘట్టాలకే పరిమితం కానుంది.

రావణుడి పాత్ర చిత్రణలో దర్శకుడు నితీష్ తివారీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా యష్ ధరించే దుస్తులు, అలంకరణలో బంగారాన్ని విరివిగా ఉపయోగించనున్నట్లు సమాచారం. ఆనాడు స్వర్ణ లంకను ఏలిన రావణుడి వైభవాన్ని.. రాజసాన్ని కళ్ళకు కట్టేలా అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను రూపొందించారు. కేవలం విలన్‌గా మాత్రమే కాకుండా ఒక వేద పండితుడిగా, శక్తివంతమైన రాజుగా రావణుడి పాత్రను ఎలివేట్ చేసేందుకు భారీగా ఖర్చు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

యుద్ధం లేకపోయినా మొదటి భాగం ఎలా ఉంటుందనే సందేహం కలగవచ్చు కానీ.. విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) పరంగా ఈ చిత్రం ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతోంది. ఆస్కార్ గెలుచుకున్న అగ్రశ్రేణి సంస్థలతో కలిసి ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో సీతాపహరణం- హనుమంతుడి పాత్ర ప్రవేశం వంటి అంశాలు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం నమ్ముతోంది. అటు రణబీర్ శ్రీ‌రాముడి పాత్ర‌లో సౌమ్యత... ఇటు రావ‌ణుడిగా యష్ గాంభీర్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

మొదటి భాగంలో వీరిద్దరి మధ్య ఘర్షణ లేకపోవడం వల్ల ఏర్పడే ఉత్కంఠ అంతా రెండో భాగంలో భారీ యుద్ధ సన్నివేశాల ద్వారా తీరేందుకు ఛాన్సుంది. రాముడు-రావణుడు మధ్య జరిగే చారిత్రాత్మక సంగ్రామాన్ని రెండో భాగంలో అత్యంత భారీ ఎత్తున చిత్రీకరించడానికి నితీష్ జీ ప్రణాళికలు సిద్ధం చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో ఈ యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయన్న మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది. రెండు విభిన్న ప్రపంచాల మధ్య సాగే ఈ పోరు వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా నిలవడం ఖాయం.

మొద‌టి భాగంలో యాక్ష‌న్ కి స్కోప్ లేక‌పోతే ఎలా?

రాముడు - రావణుడు మొదటి భాగంలో తారసపడకపోవడం యాక్ష‌న్ పార్ట్ ని త‌గ్గిస్తుందా? అంటే అవున‌నే అంగీక‌రించాలి. అయితే వీరిద్దరి కలయికను రెండో భాగం వరకు దాచి ఉంచడం ద్వారా.. పార్ట్-2 పై భారీ క్రేజ్ ఏర్పడుతుంది. లీడ్ పాత్ర వ‌ర్సెస్ విల‌న్ పాత్ర ముఖాముఖి కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తారు.

రావ‌ణుడితో రాముడు నేరుగా తలపడకపోయినా.. వారి మధ్య వారధిగా పనిచేసే హనుమంతుడు... వాలి-సుగ్రీవ యుద్ధం వంటి అంశాలను మొదటి భాగంలో హైలైట్ చేయడం ద్వారా యాక్షన్ డోస్ తగ్గకుండా దర్శకుడు బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే రావణుడి సోదరి శూర్పణఖ వల్ల కలిగే పరిణామాలు సినిమాను ముందుకు నడిపిస్తాయి గ‌నుక వీటిని ర‌క్తి క‌ట్టించేలా రూపొందించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News