రామాయణం-1లో రణబీర్, యశ్ ఎదురుపడరట
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న వాటిలో మోస్ట్ అవైటెడ్ లిస్టులో ఉన్న సినిమా.. రామాయణ.;
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న వాటిలో మోస్ట్ అవైటెడ్ లిస్టులో ఉన్న సినిమా.. రామాయణ. నిర్మాత నమిత్ మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాజెక్టు రెండు భాగాలకు కలిపి పెడుతున్న బడ్జెట్ రూ.4 వేల కోట్లు. ఈ సినిమా మొదలయ్యే సమయానికి ఏ భారతీయ చిత్రం మీదా రూ.1000 కోట్ల బడ్జెట్ కూడా పెట్టింది లేదు. అలాంటిది 4 వేల కోట్లు అంటే నమ్మశక్యం కాని విషయం. ముందుగా ఈ ఏడాది దీపావళికి రామాయణం పార్ట్-1 రాబోతోంది.
ఈ చిత్రంలో రాముడు, సీత పాత్రల్లో రణబీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తుండగా.. రావణుడి పాత్రలో యశ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించిన యశ్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో ఎలా కనిపిస్తాడా అని తన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రణబీర్, యశ్ క్లాష్ తెరపై ఒక రేంజిలో ఉంటుందనే అంచనాలున్నాయి. ఐతే రామాయణం-1లోనే ఆ క్లాష్ చూద్దామనుకున్న అభిమానులకు యశ్ షాకిచ్చాడు.
పార్ట్-1లో తనకు, రణబీర్‌కు మధ్య కాంబినేషన్ సీన్లేమీ ఉండవని యశ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన పాత్రను జస్ట్ పరిచయం వరకే చూపిస్తారని సంకేతాలు ఇచ్చాడు యశ్. దీన్ని బట్టి చూస్తే.. పార్ట్-1లో రాముడి పూర్వ కథ మీదే ప్రధానంగా దృష్టిసారించేలా ఉన్నాడు. రాముడి పుట్టుకతో మొదలుపెట్టి, వివాహం, వనవాసం ఆరంభ దశ వరకు చూపించి.. చివర్లో రావణుడు సీతను అపహరించడంతో కథను ముగించే అవకాశముంది. ఇక సెకండ్ పార్ట్ పూర్తిగా యుద్ధ నేపథ్యంలో సాగుతుందని అంచనా వేయొచ్చు.
మరోవైపు తన నెక్స్ట్ రిలీజ్ ‘టాక్సిక్’ గురించి యశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చెప్పినట్లే జూన్ 4న రాబోతోందని యశ్ స్పష్టం చేశాడు. టాక్సిక్ గ్యాంగ్‌స్టర్ మూవీ కాదని.. ప్రేక్షకులను పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని యశ్ తెలిపాడు. ఈ చిత్రాన్ని ఏక కాలంలో ఇంగ్లిష్‌లోనూ రూపొందిస్తున్నట్లు యశ్ చెప్పాడు. అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు తెలుసని.. వారి ఆకాంక్షలకు తగ్గట్లే సినిమా ఉంటుందని అతనన్నాడు.