'రామాయ‌ణం' న‌టీన‌టుల పారితోషికాల రేంజ్

భారతీయ వెండితెరపై ఇప్పటివరకూ చూడని విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, అలాగే రెండవ భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.

Update: 2026-08-02 19:49 GMT

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ చిత్రం 'రామాయణం'. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండు భాగాల దృశ్య కావ్యం ఏకంగా 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. భారతీయ వెండితెరపై ఇప్పటివరకూ చూడని విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, అలాగే రెండవ భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రధారుల రెమ్యూనరేషన్లు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ అత్యధిక పారితోషికం అందుకుంటూ రికార్డు సృష్టిస్తున్నారు. ఆయన ప్రతి భాగానికి 75 కోట్లు చొప్పున, రెండు భాగాలకు కలిపి మొత్తంగా 150 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకోనున్నారు. అదేవిధంగా రావణుడి పాత్రలో కనిపిస్తూ.. చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఒక్కో భాగానికి 50 కోట్ల చొప్పున మొత్తం 100 కోట్లు అందుకుంటున్నారు.

ముఖ్య పాత్రల్లో కనిపించే ఇతర నటీనటులు కూడా భారీ పారితోషికాలు పొందుతున్నారు. హనుమంతుడి పాత్రను పోషిస్తున్న సన్నీ డియోల్ ప్రతి భాగానికి 20 కోట్లు చొప్పున మొత్తం 40 కోట్లు, లక్ష్మణుడి పాత్రలో వెండితెరకు పరిచయమవుతున్న బుల్లితెర స్టార్ రవి దూబే ఒక్కో భాగానికి 10 కోట్లు చొప్పున మొత్తం 20 కోట్లు అందుకుంటున్నారు. సీతాదేవి పాత్రలో నటిస్తున్న సాయి పల్లవికి ప్రతి భాగానికి 6 కోట్లు చొప్పున మొత్తం 12 కోట్లు పారితోషికంగా నిర్ణయించారు.

ఈ చిత్రంలో మరొక విశేషమైన అంశం ఏమిటంటే... విద్యుజ్జిహ్వ పాత్రలో కనిపిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉచితంగా నటించడానికి అంగీకరించారు. ఇక రామానంద్ సాగర్ రామాయణం సీరియల్‌లో శ్రీరాముడిగా అలరించి అప్పట్లో ఇంపాక్ట్ చూపిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆయన పారితోషికం వివరాలు ఇంకా తెలియ‌రాలేదు. రామాయ‌ణం న‌టీన‌టులు కాస్ట్ & క్రూ పారితోషికాలే 500 కోట్ల రేంజుకు చేరుకుంటాయ‌ని ఒక అంచ‌నా.

ఈ విజువల్ వండ‌ర్ లో లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన , ఫైజ‌ల్ మాలిక్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. నటీనటుల ఎంపిక, భారీ వ్యయం.. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న నితీష్ తివారీ `రామాయణం` చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News