వ‌ర్మా జీ పోలీస్ స్టేష‌న్ లో ఇంకెంత కాలం?

సినిమా షూట్ ఏ స్టేజ్ లో ఉంద‌న్న‌ది క్లారిటీ లేదు. సినిమా నుంచి ఎలాంటి ప్ర‌చార చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు.;

Update: 2026-03-26 05:30 GMT

సంచలనాల రామ్ గోపాల్ వర్మ ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టారంటే? దానిపై అంచనాలు ఎలా ఉన్నా? చర్చ మాత్రం మామూలుగా జ‌ర‌గ‌దు. ప్ర‌స్తుతం వర్మ బాలీవుడ్‌లో `పోలీస్ స్టేషన్ మే బూత్` అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తోన్న‌ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది. షూటింగ్ కూడా మొద‌లైంది. కానీ ఆ త‌ర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇది జ‌రిగి ఏడాది అవుతుంది. దీంతో సినిమా పోలీస్ స్టేషన్‌లోనే ఉండిపోతుందా? లేక జనం ముందుకు వస్తుందా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

నిజానికి ఈ సినిమా వర్మ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత `సత్య` హీరో మనోజ్ బాజ్‌పాయీతో వర్మ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒకప్పుడు ఒక సంచలనం. దీనికి తోడు జెనీలియా దేశ్‌ముఖ్, రమ్యకృష్ణ వంటి క్రేజీ నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. హర్రర్ కామెడీ అనే కొత్త జోనర్‌లో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సినిమా షూటింగ్ అప్‌డేట్స్ విషయానికి మొద‌లైన నాటి నుంచి వ‌ర్మ ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు.

సినిమా షూట్ ఏ స్టేజ్ లో ఉంద‌న్న‌ది క్లారిటీ లేదు. సినిమా నుంచి ఎలాంటి ప్ర‌చార చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు.

వర్మ ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో ఏ ఐ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. `పోలీస్ స్టేషన్ మే బూత్` పోస్టర్ల విషయంలో కూడా ఆయన ఏఐ వాడకంపై కొన్ని విమర్శలు వచ్చాయి. బహుశా ఈ సినిమాలో గ్రాఫిక్స్ , విఎఫ్ ఎక్స్ పనులు ఎక్కువగా ఉండటం వల్లే మేకింగ్ లేట్ అవుతుంద‌నే కొంత స‌మాచారం ఉంది. క్వాలిటీ విషయంలో వ‌ర్మ ఎక్క‌డా రాజీ ప‌డ‌రు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అన్న ప్రశ్నకు స్వయంగా ఆర్జీవీనే సమాధానం చెప్పాలి.

కానీ వ‌ర్మ మాత్రం త‌న సినిమా ప‌నులు వ‌దిలేసి ఇత‌ర సినిమాల్ని ప్ర‌మోట్ చేయ‌డం ప‌నిగా పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురంధ‌ర్ 2` భారీ విజ‌యం సాధించ‌డంతో? ఆసినిమా లో న‌టీన‌టుల్ని, ద‌ర్శ‌కుడిని ఆకాశానికి ఎత్త‌డ‌మే ప‌నిగా ట్వీట్లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది చూసే ఆయ‌న అభిమానులు, ఫాలోవ‌ర్లు పోలీస్ స్టేష‌న్ సినిమా సంగ‌తేంటో తొంద‌ర‌గా తేల్చండి అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా అడుగుతున్నారు.

Tags:    

Similar News