పెద్ది.. మరోసారి తారక్ కనెక్షన్స్
ఈ గ్లింప్స్ లో చరణ్ ఒక పక్కా కుస్తీ యోధుడిలా, ఆ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తుంటే అందరికీ తారక్ కు చెప్పిన పాత కథే గుర్తొస్తోంది.;
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా అప్‌డేట్స్ వస్తున్న కొద్దీ ఒక పాత వార్త మళ్ళీ నెట్టింట హల్చల్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా కంటే ముందు దాదాపు రెండేళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో తారక్ కోసం ఆయన ఒక కుస్తీ నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో, అదే కథను ఇప్పుడు చరణ్ తో తీస్తున్నారా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది.
నిజానికి ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్న కథలో హీరో ఒక యాక్సిడెంట్ లో కాళ్లు కోల్పోతాడని, ఆ తర్వాత కుస్తీ టీమ్‌కు కోచ్‌గా మారి తన కల నెరవేర్చుకుంటాడని అప్పట్లో ప్రచారం జరిగింది. చరణ్ తో సినిమా అనౌన్స్ చేసినప్పుడు మాత్రం బుచ్చిబాబు ఒక మాట చెప్పారు. తారక్ కు చెప్పిన కథ వేరని, చరణ్ కోసం రాసుకున్నది అసలు సంబంధం లేని కొత్త సబ్జెక్టు అని క్లారిటీ ఇచ్చారు. కానీ విడుదలైన 'పహిల్వాన్' గ్లింప్స్ చూశాక సోషల్ మీడియాలో సీన్ మొత్తం మారిపోయింది.
ఈ గ్లింప్స్ లో చరణ్ ఒక పక్కా కుస్తీ యోధుడిలా, ఆ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తుంటే అందరికీ తారక్ కు చెప్పిన పాత కథే గుర్తొస్తోంది. అప్పట్లో కుస్తీ కోచ్ గా ఎన్టీఆర్ ను ఊహించుకున్న వాళ్లంతా, ఇప్పుడు చరణ్ ను అదే గెటప్ లో చూసి ఇది కచ్చితంగా ఆ పాత స్క్రిప్టే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఒకవేళ అదే కథ అయితే, అప్పుడు అనుకున్న కుస్తీ పాయింట్ కు ఇప్పుడు క్రికెట్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి బుచ్చిబాబు ఏదో కొత్త మ్యాజిక్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.
ఒక స్టార్ హీరో కోసం రెండేళ్లు కష్టపడి రాసుకున్న కథను వదులుకోలేక, దానికే కొన్ని మార్పులు చేసి చరణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా సెట్ చేశారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ కు ఇలాంటి ఒక ఇంటెన్స్ ఎమోషనల్ రోల్ పడితే ఆయన కెరీర్ కు అది పెద్ద ప్లస్ అవుతుంది. కానీ బుచ్చిబాబు మాత్రం మొదటి నుంచీ ఇవి రెండు వేర్వేరు కథలని చెబుతూనే వస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ మీద దర్శకుడు మళ్ళీ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అప్పటివరకు ఈ కథల చర్చలు సాగుతూనే ఉంటాయి. చరణ్ ఒక పహిల్వాన్ గా తన విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతుంటే, మేకర్స్ మాత్రం ఈ పాత కథల పోలికల మీద సైలెంట్ గానే ఉంటున్నారు. బుచ్చిబాబు తన స్ట్రాటజీతో ఈ పాత కథనే కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.