మెగా హీరోల సినిమాల్లో భక్తి సెంటిమెంట్.. పెద్దిలో మరింత పవర్‌ఫుల్‌గా!
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభరలో కూడా ఓ స్పెషల్ హనుమాన్ ఎపిసోడ్ ఉండబోతుందన్న వార్తలు ఇప్పటికే సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి భక్తి భావనతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆంజనేయస్వామిపై మెగా ఫ్యామిలీకి ఉన్న భక్తి అనేక సందర్భాల్లో బయటపడింది. ఇప్పుడదే సెంటిమెంట్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుండడం అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది. రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ సినిమా పెద్దిలో హనుమాన్ రిఫరెన్స్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ సీక్వెన్స్ ఉండబోతుందన్న సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ది సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన కామెంట్స్ తో ఈ అంశంపై మరింత హైప్ ఏర్పడింది.
ఇప్పటికే గ్రామీణ నేపథ్యంలో సాలిడ్ ఎమోషన్స్, మాస్ యాక్షన్, రూటెడ్ డ్రామాతో తెరకెక్కుతున్న పెద్దిపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన ఈ హనుమాన్ ఎపిసోడ్ సమాచారం సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. మెగా కుటుంబం సినిమాల్లో దేవుడి సెంటిమెంట్ కొత్త విషయం కాదు. గతంలో చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో కూడా హనుమాన్ రిఫరెన్స్ కీలకంగా నిలిచింది. ఇప్పుడదే ఫీలింగ్‌ను మరింత భారీ స్థాయిలో పెద్దిలో ప్రెజెంట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభరలో కూడా ఓ స్పెషల్ హనుమాన్ ఎపిసోడ్ ఉండబోతుందన్న వార్తలు ఇప్పటికే సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలను భారీ విజువల్స్‌తో చూపించబోతున్నారని టాక్. ఇలా ఒకవైపు విశ్వంభర, మరోవైపు పెద్ది సినిమాల్లో హనుమాన్ సెంటిమెంట్ హైలైట్ అవుతుండటంతో మెగా ఫ్యామిలీ భక్తి కోణం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అభిమానులు కూడా దీనిని కేవలం సినిమా ఎలిమెంట్‌గా కాకుండా, మెగా హీరోల వ్యక్తిగత నమ్మకాల ప్రతిబింబంగా చూస్తున్నారు.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో డివోషనల్ ఎలివేషన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మాస్ సీన్స్ లో భక్తి అంశాన్ని జోడిస్తే థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. పెద్దిలో కూడా అదే ఫార్ములాను బలంగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రత్నవేలు కెమెరా వర్క్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్.. అన్నీ కలిసి ఈ హనుమాన్ సీక్వెన్స్‌ను సినిమాకే హైలైట్‌గా నిలబెట్టొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో ఈ సీన్ కు ఫ్యాన్స్ నుంచి పూనకాల రియాక్షన్స్ రావడం ఖాయమనే కామెంట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఎమోషన్స్‌ను మాస్ ఎలివేషన్స్‌తో మిక్స్ చేయడంలో తనదైన స్టైల్ కలిగిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్దిలో హనుమాన్ రిఫరెన్స్‌ను కథలో భాగంగా ఎలా మిళితం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సీన్ అంచనాలకు తగ్గట్టుగా వర్క్ అయితే, పెద్దిలో ఇదే టాక్ ఆఫ్ ది మూవీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.