'చరణ్ - న్యూ ఏజ్ మెగాస్టార్' బిరుదుపై చిరు ఎమోషనల్!
ఇటీవల జరిగిన `రిపబ్లిక్ కాన్‌క్లేవ్` వేదికపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు లభించిన `న్యూ-ఏజ్ మెగాస్టార్` బిరుదు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో, మెగా అభిమానుల్లో ఒక రేంజ్ చర్చకు దారితీసింది.
ఇటీవల జరిగిన `రిపబ్లిక్ కాన్‌క్లేవ్` వేదికపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు లభించిన `న్యూ-ఏజ్ మెగాస్టార్` బిరుదు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో, మెగా అభిమానుల్లో ఒక రేంజ్ చర్చకు దారితీసింది. ఈ క్రేజీ టైటిల్‌పై మెగాస్టార్ చిరంజీవి పెద్ది సక్సెస్ ఈవెంట్లో స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. చరణ్‌ను ఆ పేరుతో పిలవడానికి.. ఆ బిరుదుతో సంబోధించడానికి తనకు ఎలాంటి సంకోచం లేదని చిరు స్పష్టం చేశారు. ఒక తండ్రిగా చరణ్ ఈ స్థాయికి చేరుకోవడం తనకు ఎనలేని తృప్తిని, గర్వాన్ని ఇస్తోందని.. నూటికి నూరు శాతం నిజమైన పుత్రోత్సాహాన్ని ఫీలవుతున్నానని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తమ తర్వాతి తరం మెగా లెగసీని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుండటం చూస్తుంటే ముచ్చటేస్తోందని చిరంజీవి వ్యాఖ్యానించారు.
మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకుని దూసుకుపోతున్న కొడుకును మరింత ఎత్తున చూడాలనేది ఒక తండ్రిగా చిరంజీవి ఆకాంక్ష. అందుకే ఇకపై చరణ్‌ను తానే స్వయంగా ముందుకు పుష్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ``న్యూ-ఏజ్ మెగాస్టార్‌ను ముందుకు నడిపిస్తూ... నేను వెనక ఉండి పని చేస్తాను`` అంటూ చిరంజీవి కొడుకుపై ఉన్న నమ్మకాన్ని చాటారు. కేవలం కెరీర్ పరంగానే కాకుండా... ఫిట్‌నెస్ విషయంలోనూ తాను చరణ్‌తో పోటీపడతానని, రోజుకు రెండు పూటలా.. కుదరకపోతే కనీసం ఒక పూట అయినా జిమ్ చేస్తానని తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి అల్యూమినియం ఫ్యాక్టరీ లాంటి కఠినమైన లొకేషన్లలో పని చేస్తాం తప్ప, సోంబేరితనం లేదా పనులను పోస్ట్‌పోన్ చేయడం తమ కుటుంబ నిఘంటువులోనే లేదని... కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నామని మెగాస్టార్ స్పష్టం చేశారు.
అయితే ఈ `న్యూ-ఏజ్ మెగాస్టార్` టైటిల్ చరణ్‌కు కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు, ఒక పెద్ద బాధ్యత కూడా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, `పెద్ది` చిత్రాల ఘనవిజయాలతో రామ్ చరణ్ ప్రస్తుతం పాన్-ఇండియా స్టార్‌గా నిలదొక్కుకుంటున్నారు. కానీ ఈ కొత్త బిరుదుకు న్యాయం చేయాలంటే చరణ్ తన మార్కెట్‌ను, ఇమేజ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మునుముందు అతడు కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా.. హాలీవుడ్ స్టార్లకు ధీటుగా ఎదిగి... పక్కా `పాన్-వరల్డ్ స్టార్`గా అవతరించాలని మెగాభిమానులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.
ఈ గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం కోసం రామ్ చరణ్ అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో కొలాబరేట్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇదే రిపబ్లిక్ కాన్‌క్లేవ్‌లో ప్రస్తావనకు వచ్చినట్లుగా.. దేశ సమగ్రతను, జాతీయ భావాన్ని చాటిచెప్పే `దురంధర్` లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాలీవుడ్ ప్రమాణాలతో, గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించే ఇలాంటి ఒక భారీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోసం రామ్ చరణ్ మున్ముందు ప్రయత్నిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
`న్యూ-ఏజ్ మెగాస్టార్` అనే టైటిల్ రామ్ చరణ్ కెరీర్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయినట్లే కనిపిస్తోంది. తండ్రిగా చిరంజీవి అందించిన ప్రోత్సాహం.. అభిమానులు చూపిస్తున్న అపారమైన నమ్మకం చరణ్‌కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తులో వైవిధ్యమైన ప్రాజెక్టులతో సరికొత్త అంతర్జాతీయ కొలాబరేషన్లతో రామ్ చరణ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో... మెగా లెగసీని ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చరణ్ ని ఇప్పటికే గ్లోబల్ స్టార్, మెగా పవర్‌స్టార్ అంటూ రకరకాల బిరుదులతో పిలుస్తున్న అభిమానులు ఇకపై `న్యూ ఏజ్ మెగాస్టార్` అని పిలిచేస్తూ మరింత ఉత్సాహపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు.