చరణ్ నమ్మకాన్ని బుచ్చిబాబు నిలబెట్టుకుంటాడా?

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమాలు అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి.

Update: 2026-05-26 13:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ లో ఇప్పుడు అత్యంత కీలకంగా మారిన సినిమా పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ భారీ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే ఆడియన్స్ తోపాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాపై రామ్ చరణ్ చూపిస్తున్న నమ్మకం, బుచ్చిబాబుపై వ్యక్తం చేస్తున్న విశ్వాసం ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమాలు అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. ఆచార్య, గేమ్ ఛేంజర్ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలైనా.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు చరణ్ దృష్టంతా పెద్దిపైనే ఉంది. ఈ మూవీతో మళ్లీ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆయన గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇదే కారణంగా ప్రమోషన్స్‌లో కూడా చరణ్ ఎంతో కాన్ఫిడెంట్‌ గా మాట్లాడుతున్నారు. పెద్ది తన కెరీర్ లో నెం.1 ఫిల్మ్ అని, ఇది తన కెరీర్‌ లో బెస్ట్ సినిమాల్లో ఒకటి అవుతుందంటూ ఆయన చేస్తున్న కామెంట్స్.. ఫ్యాన్స్‌ లో మరింత హైప్ పెంచుతున్నాయి. అయితే ఆ నమ్మకం నిజం కావాలంటే.. అంతా ఇప్పుడు బుచ్చిబాబు చేతుల్లోనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉప్పెనతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు.. తన రెండో సినిమాకే రామ్ చరణ్ వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ బుచ్చిబాబు చెప్పిన కథపై చరణ్ మొదటి నుంచి పూర్తి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం దర్శకుడు పడుతున్న కష్టం, ఆయన చూపిస్తున్న డెడికేషన్ చూసి చరణ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారట.

ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. పలు వేదికలపై చరణ్ మాట్లాడుతూ.. బుచ్చిబాబుతో తనకు చాలా ప్రత్యేకమైన బాండింగ్ ఉందని చెప్పారు. ఎమోషనల్ రిలేషన్ ఏర్పడిందని పేర్కొన్నారు. మరోవైపు బుచ్చిబాబు కూడా చరణ్‌ ను సోదరుడిలా భావిస్తానని చెప్పడం గమనార్హం.

ఇటీవల సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా ఇద్దరూ ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవడం కూడా అభిమానులను ఆకట్టుకుంది. తమ పెద్ది జర్నీ, సినిమా కోసం పడిన కష్టం, సెట్స్‌ లో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటూ ఎంతో ఫన్ గా కార్ రైడ్ లో మాట్లాడుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం అభిమానులందరిలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. చరణ్ పెట్టుకున్న నమ్మకాన్ని బుచ్చిబాబు నిలబెట్టుకుంటాడా? అనేది.

ఎందుకంటే పెద్ది కేవలం మరో సినిమా కాదు. ఇది రామ్ చరణ్ కెరీర్‌ కు చాలా కీలకమైన ప్రాజెక్ట్‌ గా మారింది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధిస్తేనే చరణ్ మళ్లీ పాన్ ఇండియా రేసులో స్ట్రాంగ్ గా నిలబడే అవకాశం ఉంటుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు అందరి చూపు.. బుచ్చిబాబు నిజంగానే చరణ్ కెరీర్‌ కు కావాల్సిన బ్లాక్‌ బస్టర్ ఇస్తారా లేదా అన్నదానిపైనే ఉంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News