హీరోయిన్‌ల పేరుతో వాట్సాప్ వ‌ల‌.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

ఇప్పుడు రకుల్ ప్రీత్ వంతు. నేనే ర‌కుల్ అంటూ ఒక వ్య‌క్తి ఫేక్ వాట్సాప్ నంబ‌ర్ ని ర‌కుల్ పేరుతో వైర‌ల్ చేస్తున్నాడు.;

Update: 2025-11-25 07:10 GMT

మారిన సాంకేతిక‌త న‌టీమ‌ణుల‌కు ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా క‌థానాయ‌క‌ల‌కు సోష‌ల్ మీడియాల‌ వేదిక‌గా ఫేక్ అకౌంట్ల బెడ‌ద ప్ర‌మాద‌క‌రంగా మారింది. ఇక్క‌డ అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా త‌మ గురించి త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చారం చేస్తూ, మార్ఫ్‌డ్ ఫోటోలు, వీడియోల‌ను వైర‌ల్ చేస్తూ, ఏఐలో రూపొందించిన అస‌భ్య‌క‌ర కంటెంట్ ని ప్ర‌మోట్ చేస్తూ హీరోయిన్లు, అందాల న‌టీమ‌ణుల‌కు పెను ముప్పుగా మారారు. ఈ బాప‌తును ఉచిత పీఆర్వోలుగా వ‌ర్గీక‌రిస్తే వీళ్ల‌తో ప్ర‌మాదం అంతా ఇంతా కాదు.

ఇంత‌కుముందు శ్రీయ శ‌ర‌ణ్, అదితీరావు హైద‌రీ, శ్రుతిహాస‌న్ లాంటి న‌టీమ‌ణుల‌కు ఈ త‌ర‌హా ముప్పు ఎదురైంది. వారి ఫోటోల‌తో ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఫోటోల‌ను ఉప‌యోగించి, తాజా సినిమాల స‌మాచారం అందిస్తూ, ఇంకా త‌ప్పుడువిధానంలో అకౌంట్ల‌ను ఉప‌యోగించ‌డం, వాట్సాప్ నంబ‌ర్ క్రియేట్ చేసి ప్ర‌చారానికి ఉప‌యోగించుకున్న విధానంతో స‌ద‌రు క‌థానాయిక‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. సోష‌ల్ మీడియాల్లో ఫేక్ ఖాతాల‌ను ఉప‌యోగించ‌డ‌మే గాక త‌మ పేరుతో ఒక వాట్సాప్ నంబ‌ర్ ని కూడా స‌ర్క్యులేట్ చేసి దుర్వినియోగం చేయ‌డం లేదా స్వార్థ ప్ర‌యోజ‌నం కోసం ఉప‌యోగించ‌డానికి అల‌వాటు ప‌డ్డారు. దీనిపై సైబ‌ర్ క్రైమ్ కి కూడా ఫిర్యాదు చేసారు. ఆ త‌ర్వాత ఆ అకౌంట్ల‌ను డిలీట్ చేసింది సైబ‌ర్ క్రైమ్. గూగుల్ వైప‌రీత్యాల్లో ఈ ఫేక్ బెడ‌ద‌ను త‌ట్టుకోవ‌డానికి మ‌గువ‌ల‌కు చాలా గుండె ధైర్యం కావాల్సిన ప‌రిస్థితి ఇటీవ‌లి కాలంలో ఉంది.

ఇప్పుడు రకుల్ ప్రీత్ వంతు. నేనే ర‌కుల్ అంటూ ఒక వ్య‌క్తి ఫేక్ వాట్సాప్ నంబ‌ర్ ని ర‌కుల్ పేరుతో వైర‌ల్ చేస్తున్నాడు. వాట్సాప్‌లో త‌న‌ పేరు, ఫోటోలను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నాడ‌ని ర‌కుల్ స్వ‌యంగా సైబ‌ర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసారు. ముందుగా న‌కిలీ వ్య‌క్తి షేర్ చేస్తున్న వాట్సాప్ నంబ‌ర్ 8111067586 ని న‌మ్మొద్ద‌ని ర‌కుల్ ప్రీత్ త‌న అభిమానుల‌ను అభ్య‌ర్థించారు. మోసగాడు వాట్సాప్ వ‌ల వేస్తున్నాడు త‌స్మాత్ జాగ్ర‌త్త‌! ద‌య‌చేసి ఆ నంబ‌ర్ ను బ్లాక్ చేయండి! అని హెచ్చ‌రించారు.

వాట్సాప్ నంబ‌ర్ ని షేర్ చేసి ఇది నా నంబ‌ర్ కాద‌ని ర‌కుల్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఆ నంబ‌ర్ తో ఎలాంటి సంభాష‌ణ‌లు సాగించ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ఆ నంబ‌ర్ తో వాట్సాప్ గ్రూప్ ఉన్న‌ స్క్రీన్ షాట్ ని కూడా షేర్ చేసారు. ఇది కేవ‌లం ర‌కుల్, అదితీరావ్, శ్రీ‌య‌ల‌కు చెందిన స‌మ‌స్య కాదు. ఇది అంద‌రు సెల‌బ్రిటీల‌కు వ‌ర్తిస్తుంది. ఒక‌రి పేరును ఉప‌యోగించుకుని వ్యాపారం న‌డిపించే లేదా లాభాలు పొందే మార్గాల‌ను సోష‌ల్ మీడియాల్లో కొంద‌రు అన్వేషిస్తున్నారు. అయితే ఇది క్రైమ్ ప‌రిధిలోకి వ‌స్తుంది. దొరికితే క‌ట‌క‌టాలే!

ర‌కుల్ ప్రీత్ న‌టించిన‌ `దే దే ప్యార్ దే 2` ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ సీక్వెల్ కూడా మొద‌టి సినిమా త‌ర‌హాలోనే స్లీప‌ర్ హిట్ గా మారింది. ఈ చిత్రంలో ఎప్ప‌టిలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఆయేషా పాత్రలో క‌నిపించింది. ర‌కుల్ తిరిగి సౌత్ లో న‌టించాల‌ని భావిస్తోంది. కానీ ఎందుక‌నో అవ‌కాశాలు రాలేదు.

Tags:    

Similar News