'క్రిష్ 4' ఇంకెన్నాళ్లు? హృతిక్ డెబ్యూకి ఆదిలోనే హంస‌పాదు!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన`క్రిష్ 4` చుట్టూ అస‌లేం జ‌రుగుతోంది? ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఎందుకు అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఇన్నాళ్లు స‌రైన జ‌వాబు లేదు.

Update: 2026-06-08 22:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన`క్రిష్ 4` చుట్టూ అస‌లేం జ‌రుగుతోంది? ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఎందుకు అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఇన్నాళ్లు స‌రైన జ‌వాబు లేదు. ఏళ్ల త‌ర‌బ‌డి స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని చెప్పుకొచ్చిన రాకేష్ రోష‌న్ ఆ సినిమా స్క్రిప్టు కోసం ఏమీ చేయ‌లేద‌ని అర్థ‌మైంది. ప్ర‌స్తుతం య‌ష్ రాజ్ బ్యాన‌ర్ తో క‌లిసి రోష‌న్ లు స్క్రిప్టును డెవ‌ల‌ప్ చేస్తున్నారు. అదే క్ర‌మంలో బ‌డ్జెట్ విష‌యంలో వైఆర్ఎఫ్ తో విభేధాలొచ్చాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ ప్రచారానికి సీనియర్ దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా కోసం హృతిక్ ఏకంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ డిమాండ్ చేశాడంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం బేస్ లెస్ రూమర్లని కొట్టిపారేసిన ఆయన... ఈ సూపర్ హీరో చిత్రానికి సంబంధించి మేకర్స్ మధ్య ఎలాంటి ఆర్థికపరమైన విభేదాలు లేవని అధికారికంగా స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా మీడియా సర్కిల్స్‌లో ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX).. భారీ యాక్షన్ సన్నివేశాల కోసం హృతిక్ రూ. 500 కోట్లు కావాలని పట్టుబట్టాడని... అయితే బిజినెస్ సేఫ్టీ కోసం నిర్మాత ఆదిత్య చోప్రా రూ. 350 కోట్లకు మించి పెట్టలేనని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ బడ్జెట్ వ్యత్యాసాల వల్లే హీరోకి- నిర్మాణ సంస్థకు మధ్య విభేదాలు తలెత్తాయని.. అందుకే సినిమా ఆలస్యమవుతూ హోల్డ్‌లో పడిందంటూ కథనాలు వచ్చాయి. ఈ వార్తలతో అయోమయంలో పడ్డ అభిమానులకు రాకేష్ రోషన్ తాజా ప్రకటనతో పూర్తి క్లారిటీ వచ్చేసింది.

ఈ రూమర్లపై రాకేష్ రోషన్ ఘాటుగా స్పందిస్తూ.. ``అదంతా అబద్ధం.. పుకార్లలో ఎలాంటి నిజం లేదు`` అని తేల్చిచెప్పారు. బడ్జెట్ విషయంలో కానీ... సినిమా స్కేల్ (పరిధి) విషయంలో కానీ.. హృతిక్‌కు, మేకర్స్‌కు మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. సినిమా అనుకున్న ప్రకారమే ట్రాక్‌లో ఉందని... స్క్రిప్ట్ పనులు కూడా సజావుగా సాగుతున్నాయని చెబుతూ ఇండస్ట్రీలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి ఆయన పూర్తిగా చెక్ పెట్టారు.

ఇక సినిమా ఆలస్యం కావడంపై వస్తున్న ఆందోళనలను కూడా ఆయన నివృత్తి చేశారు. `క్రిష్ 4` లాంటి భారీ స్థాయి ప్రాజెక్టులను నిర్మించడానికి సహజంగానే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. క్రిష్ ఫ్రాంచైజీలో వచ్చిన ప్రతి భాగానికి కూడా షూటింగ్ వెళ్ళేముందు సుదీర్ఘమైన ప్లానింగ్- ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అవసరమయ్యాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బడ్జెట్ గొడవల వల్ల కాకుండా.. హృతిక్ రోషన్ తన ఇతర సినిమాలతో డైరీ ఫుల్ అయిపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ లైన్ లోకి రావడానికి సమయం పడుతోందని ఆయన స్పష్టమైన కారణాన్ని విశ్లేషించారు.

భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ఏకైక సూపర్ హీరో సిరీస్ కావడంతో `క్రిష్ 4` అప్‌డేట్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటన్నింటికీ మించి ఈ చిత్రంతో హృతిక్ రోషన్ దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడనే టాక్ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను రెట్టింపు చేసింది. రాకేష్ రోషన్ ఇచ్చిన తాజా అధికారిక వివరణతో బడ్జెట్ క్లాషెస్ అంటూ వచ్చిన వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేలిపోవడంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సైతం సానుకూల వాతావరణం ఏర్పడింది.

Tags:    

Similar News