థియేటర్లను ఊపేసిన హిరాని.. ఇప్పుడు OTTలో మ్యాజిక్‌కు రెడీ!
ఇక జియో హాట్ స్టార్ పరంగా చూసుకున్నా కూడా , ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది.
బాలీవుడ్‌లో క్వాలిటీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచిన డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి వరుస బ్లాక్‌బస్టర్లతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన నమ్మకం సంపాదించుకున్న హిరాని.. ఇప్పుడు తొలిసారి వెబ్ సిరీస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
జియో హాట్ స్టార్ వేదికగా జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న ప్రీతమ్ అండ్ పెడ్రో సిరీస్‌కు ఆయన క్రియేటర్, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో మ్యాజిక్ చేసిన డైరెక్టర్ ఇప్పుడు ఓటీటీలో అదే స్థాయి ప్రభావం చూపగలడా అనే ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన హిరాని, డిజిటల్ ఫార్మాట్‌లో కథ చెప్పబోతుండటం ఆయన కెరీర్‌లో కీలకమైన మలుపుగా భావిస్తున్నారు.
డంకీ తర్వాత హిరాని నెక్ట్స్ సినిమా ఏంటనే ప్రశ్న చాలా నెలలుగా బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఒకవైపు మున్నాభాయ్3, మరోవైపు 3 ఇడియట్స్ సీక్వెల్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ గ్యాప్‌లోనే హిరాని వెబ్ కంటెంట్‌పై దృష్టి పెట్టడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో ఏడాదికి ఒక సినిమా చేసే డైరెరక్టర్ల లిస్ట్ లో కాకుండా.. దశాబ్దానికి కొన్ని క్లాసిక్‌లు ఇచ్చే డైరెక్టర్ హిరాని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ఫిల్మోగ్రఫీలో పెద్ద ఫ్లాప్ లేకపోవడం, ప్రతి సినిమాకూ ప్రత్యేకమైన ఎమోషన్, హ్యూమర్, సోషల్ మెసేజ్ మేళవించడం వల్లే ప్రేక్షకులు ఇప్పటికీ హిరాని సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు భారీ గ్యాప్ తీసుకుని వెబ్ సిరీస్ చేయడం వెనుక ఓటీటీ మార్కెట్ పెరుగుదల కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. థియేటర్లతో పాటు డిజిటల్ వేదికలపై కూడా బలమైన కంటెంట్ అందించాలనే ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక జియో హాట్ స్టార్ పరంగా చూసుకున్నా కూడా , ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్‌ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, భారీ డైరెక్టర్లను, స్టార్ కంటెంట్‌ను తమ వైపు తిప్పుకోవాలని ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సమయంలో హిరాని వంటి డైరెక్టర్ ను వెబ్ సిరీస్ కోసం ఒప్పించడం జియో హాట్ స్టార్‌కు పెద్ద బూస్ట్‌గా మారింది. ప్రీతమ్ అండ్ పెడ్రో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తరహా కథలా కనిపిస్తోంది. మరోవైపు ఈ సిరీస్‌లో హిరాని కొడుకు వీర్ హిరాని కీలక పాత్ర చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అర్షద్ వార్సీ నటించడం వల్ల మున్నాభాయ్ ఫీల్ కూడా ప్రేక్షకులకు గుర్తుకొస్తోంది. ఈ సిరీస్ సక్సెస్ అయితే హిరాని మరిన్ని ఓటీటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టే అవకాశముందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రీతమ్ అండ్ పెడ్రో తర్వాత ఆయన నెక్ట్స్ మూవీ, ముఖ్యంగా 3 ఇడియట్స్-2పై క్లారిటీ వచ్చే అవకాశముందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.