బాషా 2 వద్దన్న రజనీ.. జైలర్ 2 ఎందుకు?

హిట్ సినిమా వచ్చిందంటే రెండో భాగం కోసం ప్రయత్నాలు మొదలవుతుంటాయి. కానీ రజనీకాంత్ మాత్రం తన కెరీర్‌లో రెండు పెద్ద హిట్లకు సీక్వెల్స్ చేసే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు.

Update: 2026-10-11 05:33 GMT

హిట్ సినిమా వచ్చిందంటే రెండో భాగం కోసం ప్రయత్నాలు మొదలవుతుంటాయి. కానీ రజనీకాంత్ మాత్రం తన కెరీర్‌లో రెండు పెద్ద హిట్లకు సీక్వెల్స్ చేసే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు. ఇప్పుడు అదే రజనీ ‘జైలర్ 2’తో థియేటర్లకు వస్తున్నారు. ఇందులో ఇంకో విశేషం ఉంది. ఈ సినిమా రెండో భాగం చేయాలని మొదట అనుకున్నది దర్శకుడు నెల్సన్ కాదు. రజనీయే ఆ ఆలోచనతో ఆయన దగ్గరకు వెళ్లారట. ‘జైలర్ 2’ ప్రమోషన్లలో ఈ విషయం బయటపెట్టారు.

1995లో వచ్చిన ‘బాషా’కు సీక్వెల్ చేయాలని సత్యా మూవీస్ పలుమార్లు సంప్రదించినట్లు రజనీ చెప్పారు. ఆ తర్వాత ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కూడా రెండో భాగం కథ వినిపించారు. విజయ్ సేతుపతి పాత్ర ప్రతీకారం తీర్చుకునేలా ఆ కథను అనుకున్నారట. కానీ రజనీ అంగీకరించలేదు. మొదటి పార్ట్‌లో పనిచేసిన అంశాలకు ఇంకొంత మసాలా కలిపి మళ్లీ సినిమా తీయడం తనకు ఇష్టం ఉండదని వివరించారు.

మరి ‘జైలర్’ విషయంలో అభిప్రాయం ఎలా మారింది? మొదటి సినిమా థియేటర్లలో విడుదలై ఓటీటీలోకి వచ్చిన తర్వాత రజనీ మరోసారి చూశారట. క్లైమాక్స్‌కు ముందు వర్మ చేసిన హెచ్చరికల దగ్గర ఆగిపోయారు. తన వెనక పెద్ద నెట్‌వర్క్ ఉందని, ముత్తువేల్ పాండియన్‌ను వాళ్లు వదిలిపెట్టరని వర్మ చెబుతాడు. మూడు కంటైనర్లలో వెయ్యి కోట్ల రూపాయల వ్యవహారం ప్రస్తావన కూడా అక్కడే ఉంటుంది.

ఆ మాటల్లోనే మరో సినిమా చేయడానికి అవకాశం ఉందని రజనీ భావించారు. పైగా తన వయసుకు సరిపోయే ముత్తువేల్ పాండియన్ లాంటి పాత్ర మళ్లీ దొరకడం సులభం కాదని చెప్పారు. అందుకే నెల్సన్‌ను కలిసి సీక్వెల్ ఆలోచన చెప్పారు. కానీ నెల్సన్ మొదట ఒప్పుకోలేదట. మొదటి పార్ట్‌లో చెప్పాల్సినవన్నీ చెప్పేశామని, మళ్లీ అదే కథలోకి వెళ్లడం ఎందుకని సమాధానం ఇచ్చారు. దాంతో రజనీ కూడా ఆ విషయం వదిలేశారు.

అయితే నెల రోజుల తర్వాత నెల్సన్ స్వయంగా తిరిగి వచ్చి ‘జైలర్ 2’ చేద్దామని చెప్పారట. అప్పటికి ఆయన మరో సినిమా పనుల్లో ఉండగా వాటిని పక్కనపెట్టి ఈ కథ కోసం పనిచేశారని రజనీ వెల్లడించారు. సాధారణంగా దర్శకుడు సీక్వెల్ ప్రతిపాదన తీసుకెళ్లడం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం హీరో ఆలోచన చెప్పడం, దర్శకుడు మొదట వద్దనడం, ఆ తర్వాత తిరిగి అదే ప్రాజెక్ట్‌కు రావడం జరిగింది.

సన్ పిక్చర్స్ మరోసారి జైలర్ ప్రపంచాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న విడుదల కానున్న ‘జైలర్ 2’లో రజనీ మళ్లీ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. మొదటి పార్ట్‌కు సంగీతం అందించిన అనిరుధ్ ఈ సినిమాకూ అదే రేంజ్ లో ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా తిరిగి నటిస్తుండగా ఎస్.జె.సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి కొత్తగా చేరారు. తమన్నాతో మరో పాట ఉండాలని తాను కోరుకున్నా, కథకు అవసరం లేదంటూ నెల్సన్ అంగీకరించలేదని కూడా రజనీ ఇదే కార్యక్రమంలో చెప్పారు.

Tags:    

Similar News