ప్ర‌ఖ్యాత న‌టి 'ట్రీ హౌస్' అమ్మ‌కం.. ఎమోష‌న‌ల్ జ‌ర్నీ!

హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ లాస్ ఏంజెల్స్‌లోని తన ఫేవరెట్ మిడ్‌సెంచరీ మోడర్న్ ఇంటికి గుడ్ బై చెప్పారు.

Update: 2026-10-11 02:30 GMT

హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ లాస్ ఏంజెల్స్‌లోని తన ఫేవరెట్ మిడ్‌సెంచరీ మోడర్న్ ఇంటికి గుడ్ బై చెప్పారు. `ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే` చిత్రంతో గ్లోబల్ స్టార్‌డమ్ అందుకున్న‌ తరుణంలో 2016 జనవరిలో $3.55 మిలియన్లకు కొనుగోలు చేసిన ఈ ఇంటిని తాజాగా $5,924,372 (సుమారు 49.5 కోట్లు) కు విక్రయించారు. మార్కెట్లో $6 మిలియన్లకు లిస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ ఇల్లు అమ్ముడుపోవడం విశేషం.

1947 లో ప్రముఖ ఆర్కిటెక్ట్ కార్ల్ మాస్టన్ ఈ ఇంటిని డిజైన్ చేశారు. కాలిఫోర్నియా మోడర్నిజం శైలికి ప్రతీకగా నిలిచే ఈ 3,200 చదరపు అడుగుల ఇంట్లో మూడు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి. నిర్మాణంలో క్లీన్ లైన్స్ ..సహజమైన వెచ్చదనం ఉట్టిపడేలా మాస్టన్ దీనిని తీర్చిదిద్దారు. ఈ ఇంటి ప్రత్యేకమైన డిజైన్ చూసి తాను ఎప్పటికీ దీనిని విడిచిపెట్టలేనని డకోటా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ ఇంటిని కేవలం సెలబ్రిటీ షోపీస్‌లా కాకుండా.. తన వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టుగా `పియర్స్ & వార్డ్` డిజైన్ సంస్థతో కలిసి ఆమె పునర్నిర్మించారు. ఇంట్లోని పెద్ద గాజు గోడలు, చెక్క బీమ్‌లు, ఎర్రటి ఇటుకల నిర్మాణాన్ని అలాగే ఉంచుతూ ఇంటి లోపలి నుండి బయట ఉన్న పచ్చని ప్రకృతి, గార్డెన్ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త పడ్డారు. అలాగే ఆమె ఫేవరెట్ స్వెటర్ స్పూర్తితో మాస్టర్ బాత్‌రూమ్‌ను ప్రత్యేక పింక్ రంగులో డిజైన్ చేయించుకున్నారు.

ఇంటి వెలుపల స్విమ్మింగ్ పూల్, అవుట్‌డోర్ పెట్రోయోస్, ఫైర్ పిట్ .. పచ్చని చెట్లతో కూడిన ప్రశాంతమైన వాతావరణం దీని సొంతం. నిరంతరం షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే డకోటాకు ఈ ఇల్లు ఒక ప్రశాంతమైన అభయారణ్యంలా ఉపయోగపడింది. తన కెరీర్ వేగంగా మారుతున్న ఆ రోజుల్లో ఈ ఇల్లే త‌న‌కు ఎంతో మానసిక స్థిరత్వాన్ని ఇచ్చింది.

ఈ చారిత్రాత్మక గృహాన్ని సేల్ కి వ‌చ్చాక‌.. మిడ్‌సెంచరీ ఆర్కిటెక్చర్ విలువ ఏపాటిదో ఈ అమ్మకం మరోసారి నిరూపించింది. కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే చ‌క్క‌ని లాభాన్ని అందించిన ఈ ఇల్లు డకోటా జాన్సన్ జీవితంలో ఒక సుందరమైన అధ్యాయాన్ని ముగించి కొత్త యజమానికి సొంతమైంది. మీడియా క‌థ‌నాల‌ ప్రకారం డకోటా ఇప్పుడు అవుట్‌పోస్ట్ ఎస్టేట్స్‌లోని మరో కొత్త ఇంటికి మారారు.

Tags:    

Similar News